తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ.. కీలక నిర్ణయాలివే..

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ.. కీలక నిర్ణయాలివే..

jagan-and-kcr

విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అయ్యారు. ఏపీ సీఎం జగన్‌ వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ వచ్చారు. కేసీఆర్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. జగన్ ప్రతినిధి బృందంతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు దాదాపు 6 గంటల పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైనా, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. పూర్తి సహృద్భావ వాతావరణంలో, పరస్పర సహకార స్ఫూర్తితో ఈ సమావేశం జరిగింది. పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది.

ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే విషయంలో ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రతీ ఏడాది ఒకే రకంగా ఉండడం లేదు. చాలా సందర్భాల్లో ఆయకట్టుకు సాగునీరు రావడం లేదు. ఇదే సమయంలో గోదావరిలో నీటిలభ్యత పుష్కలంగా ఉంటోంది. ఆ నీటిని తరలించి కృష్ణా ఆయకట్టు రైతులకు ఇవ్వడమే వివేకవంతమైన చర్య అని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను ఉపయోగించుకుంటూనే గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించాలని తీర్మానించారు.

గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎటు తరలించాలి? ఎలా వినియోగించాలి? దీనికి సంబంధించిన మోడల్ ఎలా ఉండాలి? అనే విషయాలపై తదుపరి సమావేశంలో మరింత విపులంగా చర్చించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ‘‘విభజన చట్టంలోని 9, 10 వ షెడ్యూల్లోని పలు అంశాలపై అనవసర పంచాయతీ ఉంది. దీన్ని త్వరగా పరిష్కరించుకోవాలి. పరస్పర సహకారం, అవగాహనతో వ్యవహరిస్తే దీన్ని పరిష్కరించడం పెద్ద కష్టం ఏదీ కాదు’’ అని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడ్డారు. సమావేశం నుంచే ఇద్దరు సీఎంలు తమ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో ఫోన్లో మాట్లాడారు. 9, 10 వ షెడ్యూల్ లోని అంశాలను పరిష్కరించుకునే దిశలో త్వరలోనే సమావేశం కావాలని ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story