విదేశాలకు తాకిన ఏపీ రాజధాని అంశం

విదేశాలకు తాకిన ఏపీ రాజధాని అంశం

save

రాజధాని అమరావతి కోసం అమెరికాలోను ప్రవాసాంధ్రులు రోడ్డెక్కారు. రాజధాని రైతులకు మద్దతుగా టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ లో ఎన్నారైలు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాలకు చెందిన వారు పాల్గొని, రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నినదించారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని హామి ఇచ్చారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వన్ స్ట్రేట్, వన్ క్యాపిటల్ పేరుతో భారీ ర్యాలీ తీశారు.

మరోవైపు అమెరికా పోర్ట్లాండ్ లో కూడా ప్రవాస తెలుగువారు రాజధాని అంశంపై స్పందించారు. రాజధాని రైతులపై పోలీసుల అకృత్యాలను వారు తీవ్రంగా ఖండించారు. పరిపాలనకు సిద్దంగా ఉన్న అమరావతిని కాదని మరోచోటుకు మార్చడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. మహిళలు, పిల్లలు, వృద్దులపై జరుగుతున్న పోలీసుల దాడులపై మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ అంశం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు సమైక్యంగా పోరాడాలని వారు కోరారు.

అటు సేవ్ అమరావతి పేరుతో ప్రవాసాంధ్రులు అమెరికన్ రాజధాని వాషింగ్టన్ డీసిలో ర్యాలీ నిర్వహించారు. రైతుల త్యాగాలకు ఫలితం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అమరావతి రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని కోసం భూములను ఇచ్చిన రైతులను గౌరవించాలని వారు వెల్లడించారు. రాజధానిని మార్చి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించకూడదని వారు డిమాండ్ చేశారు. రాజధాని రైతుల బాధలను తట్టుకోలేక మేము ఉద్యమిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమనతోపాటు పలువురు ఎన్నారైలు పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story