చిత్తూరు జిల్లాలో జోరుగా జల్లికట్టు

చిత్తూరు జిల్లాలో జోరుగా జల్లికట్టు

jallikattu

జల్లికట్టు పోటీలు చిత్తూరు జిల్లాలో సంక్రాంతి ఎట్రాక్షన్‌గా మారాయి. పోలీసుల అంక్షలున్నా.. జల్లికట్టు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనుప్పల్లి, రేకలచేనులో నిర్వహించిన పోటీల్లో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎద్దు కొమ్ములకు కట్టిన కానుకల్ని తీసుకునేందుకు.. వాటి మూపురాల్ని పట్టుకుని నిలువరించేందుకు భారీగా పోటీ పడ్డారు.

ఈ ఎడ్ల పందాలు చిత్తూరు జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ‍ఒక్కోలా జరుగుతుంటాయి. కొన్నిచోట్ల ఎద్దులను గుంపులుగా వదిలి పరుగెత్తిస్తే.. మరికొన్ని చోట్ల ఒక్కోదాన్ని వదులుతారు. సంక్రాంతి సందర్భంగా జల్లికట్టుతో జరిగే గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. వందల మంది క్రీడలో పాల్గొన్నారు. వేలాది మంది వీధుల్లో నిలబడి, మిద్దెలెక్కి తిలకించారు.

తమిళనాడు సరిహద్దు జిల్లా కావడంతో చిత్తూరు జిల్లాలోనూ సంక్రాంతి ఉత్సవాల్లో జల్లికట్టు భాగమైపోయింది. వీటిని చూసేందుకు పక్క జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రమాదమని తెలిసినా గిత్తలను పట్టుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే చంద్రగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బుల్‌ఫైట్‌లో ప్రమాదాలు జరుగుతున్నా.. ఏటికియేడు ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఇది తమ పూర్వికుల నుంచి వస్తున్న సంప్రదాయమని స్థానికులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story