కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సంక్రాంతిని ఎలా చేసుకుంటారంటే తెలిస్తే..

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సంక్రాంతిని ఎలా చేసుకుంటారంటే తెలిస్తే..

sankanti-new

సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుతుంటారు. కుటుంబసభ్యుల ఆత్మీయ కలయికలు, కోడి పందేలు, ఎడ్ల పందేలు, తినుబండారాల తయారీతో మహా గొప్పగా ఉంటుంది. ఐతే, ఈ పండుగ మనకు మాత్రమే పరిమితమైనది కాదు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ వేడుకను చేసుకుంటారు. దక్షిణాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన కశ్మీర్ వరకు తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమాన కర్ణాటక వరకు రకరకాల పద్ధతుల్లో ఉత్సవాలు జరుపుకుంటారు. పేర్లు వేరైనా, ఆచార వ్యవహారాలు వేర్వేరుగా ఉన్నా దేశం మొత్తం ఈ పండుగను నిర్వహిస్తుంటారు.

కర్ణాటకలో సంక్రాంతిని సుగ్గి పేరుతో జరుపుకుంటారు. పండుగ రోజున అమ్మాయిలు కొత్త దుస్తులు ధరించి ఆత్మీయుల ఇళ్లకు వెళ్తారు. ఒక ప్లేట్‌లో తెల్ల నువ్వులు, వేయించిన వేరుశనగ పప్పు, ఎండు కొబ్బరి, బెల్లంతో తయారు చేసిన స్వీట్, చెరకుగడ ముక్కలు, పసుపు-కుంకుమ పెట్టి బంధుమిత్రులకు వాయినం ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ పద్ధతిని ఎల్లు బిరోదు అంటారు. తెల్ల నువ్వులు, వేయించి న వేరుశనగ పప్పు, ఎండు కొబ్బరి మిశ్రమంతో చేసిన స్వీట్‌ను ఎల్లు బెల్ల అంటారు. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కొత్తగా పెళ్లైన అమ్మాయిలు, ముత్తైదువలకు అరటిపళ్లు వాయినం ఇస్తారు. కొన్ని కుటుంబాల్లో ఎర్ర బెర్రీలను ఇచ్చి పుచ్చుకుంటారు.

ఎల్లు బెల్ల తిని మంచి మాటలు మాట్లాడాలని కర్ణాటకలో ఓ నానుడి. ఇక, సుగ్గి ప్రధానంగా వ్యవసాయ పండుగ. పంటలు పండి ఫలసాయం ఇంటికొచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని ఉత్సవం చేసు కుంటారు. వ్యవసాయంలో ప్రధాన భాగమైన ఎడ్లు, ఆవులను సుందరంగా అలంకరిస్తారు. ఎడ్లతో పందేలు నిర్వహిస్తారు. ఎడ్ల ప్రదర్శన మరో ఆకట్టుకునే అంశం. గ్రామీణ కర్ణాటకలో జరిగే ఈ వేడుకను కిచ్చు హయిసువుడు అంటారు.

తమిళనాడుకు కూడా సంక్రాంతి చాలా ప్రత్యేకం. ఇక్కడ పొంగల్ పేరుతో పండుగ చేసుకుంటారు. 4 రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. మొదటి రోజు భోగి, రెండోరోజు థాయి పొంగల్, మూడో రోజు మాట్టు పొంగల్, నాలుగో రోజు కానుమ్ పొంగల్‌ అంటారు. మార్గళి చివరి రోజున భోగి మంటలు వేసి పాత వస్తువులు, దుస్తులను అగ్నికి ఆహుతి చేస్తారు. కొత్తదనానికి ఆహ్వానం పలుకుతారు. గ్రామాల్లో కప్పు కట్టు పేరుతో చేసే వేడుకలు ఆకర్షణీయంగా ఉంటాయి. దుష్ట శక్తులు పోవాలంటూ ఇళ్లు, గోడలపై వేప ఆకులు, కొమ్మలు ఉంచుతారు. థాయ్ పొంగల్ రోజున ఇళ్లను అందంగా అలంక రించుకుంటారు. పొంగల్ తయారు చేసి కుటుంబసభ్యులు, బంధు మిత్రులకు పంచి పెడతారు. ఘుమఘుమలాడే పిండి వంటలు, తినుబండారాలతో విందు ఆరగిస్తారు.

పొంగల్ కూడా వ్యవసాయ ప్రధానమైనదే. అన్నదాతలు, పశువులతో ముడిపడి ఉన్నదే. మాట్టు పొంగల్ రోజున పశువులకు కృతజ్ఞతలు చెప్తారు. పాడిపంటలను కాపాడుతూ తమ ఇళ్లల్లో సిరులు పొం గిస్తున్న పశువులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. కొమ్ములకు రంగులు వేసి ముస్తాబు చేస్తారు. వాటిని స్వేచ్చగా వదిలేస్తారు. కనుమ రోజున బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తారు. హాయిగా కబుర్లు చెప్పుకుం టూ కాలక్షేపం చేస్తారు. ఇక, జల్లికట్టు సందడి తెలిసిందే. పొంగల్ నాడు తమిళనాడు యావత్తూ జల్లికట్టు వేడుకల్లో మునిగి తేలుతుంది.

కేరళలోను సంక్రాంతి వేడుకలు జరుగుతాయి. ఐతే, ఉత్సవాలు పవిత్ర శబరిమలకే ప్రత్యేకం. అయ్యప్ప సన్నిధానంలో మకర సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తారు. సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శ నమిస్తుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మకరవిళక్కు ఉత్సవాలు జరుపుకుంటారు.

తూర్పు భారతంలోనూ సంక్రాంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తారు. ఒడిశాలో మకర చోల పేరుతో ప్రత్యేక వంటకం తయారు చేస్తారు. సంక్రాంతి కొత్త పంటలు వచ్చే కాలం. అలాగే చలి తీవ్రత తగ్గుతూ కాలంలోనూ మార్పులు వచ్చే సమయం. ఈ ప్రత్యేకతలను పురస్కరించుకొని ఆహార అలవాట్లను కూడా మార్పుకుంటారు. బియ్యం, అరటిపండ్లు, కొబ్బరి, బెల్లం, నువ్వులతో రకరకాల పదార్థాలు తయారు చేస్తారు. రసగుల్లా స్వీట్ తప్పనిసరిగా ఉంటుంది. వివిధ రకాల ఆహార పదార్థాలను దేవతలకు నైవేద్యం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలసి భోజనం చేస్తారు. సౌరమానం ప్రకారం వచ్చే పండుగ కాబట్టి సూర్యునికి ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. కోణార్క్‌లోని సూర్యదేవాలయానికి భక్తులు పోటెత్తుతారు. పూరీ జగన్నాథ అలయం సహా ప్ర ముఖ ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. తీర ప్రాంతాల్లో మకర మేళా నిర్వహిస్తారు.

బెంగాల్‌ కూడా సంక్రాంతి వేడుకలకు ప్రసిద్ది పొందింది. ఇక్కడ పౌష్ సంక్రాంతి పేరుతో వేడుకలు చేస్తారు. ఇది ప్రధానంగా వ్యవసాయ పండుగ. కొత్త పంటలతో బెంగాలీ సంప్రదాయ వంటలు తయారు చేసి నైవేద్యం పెడతారు. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఖర్జూరం-బెల్లం కలిపిన స్వీట్లను బంధుమిత్రులకు పంచి పెడతారు.

Tags

Read MoreRead Less
Next Story