వైసీపీ విషప్రచారాన్ని బయటపెట్టిన ఈ మెయిల్.. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు

అమరావతిలో నిర్మాణాలు సురక్షితం కాదంటూ.. వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలిపోయింది. తాము అలాంటి నివేదిక ఏదీ ఇవ్వలేదంటూ మద్రాస్ ఐఐటీ స్పష్టంచేసింది. ఈమేరకు అమరావతి రైతులకు మద్రాస్ ఐఐటీ పెద్దలు ఇ-మెయిల్ పంపారు. అమరావతిలో నిర్మాణాలు సురక్షితం కాదని తాము చెప్పలేదని మద్రాస్ ఐఐటీ స్పష్టం చేసింది. అక్కడి నేలలో బలం లేదని నివేదిక ఇచ్చామనడం అబద్ధమని అందులో తెలిపింది.
రాజధానిగా అమరావతి సురక్షితం కాదని నివేదిక ఇచ్చారా అంటూ ఐఐటీ మద్రాస్‌కు రైతులు మెయిల్ పంపగా.. అటు నుంచి జవాబు వచ్చింది. తాము రిపోర్ట్ ఇచ్చామనడాన్ని ఐఐటీ పెద్దలు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడీ ఇ-మెయిల్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అమరావతిపై నెగెటివ్ ప్రచారం చేయాలనుకున్న ప్రభుత్వ వ్యూహం మరోసారి బెడిసి కొట్టిందని అమరావతి జేఏసీ నేతలు అన్నారు. అమరావతిలో నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు అవుతుందని.. భారీ నిర్మాణాలు కష్టమంటూ ఐఐటీ-మద్రాస్ పేరుతో మంత్రులు చేసిన ప్రకటనలు అవాస్తవం అని తేలిపోయిందని రైతులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com