బీజేపీ జాతీయాధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధం

బీజేపీ జాతీయాధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధం

బీజేపీ జాతీయాధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20వ తేదీన ప్రెసిడెంట్ పోస్టుకు నామినేషన్లు దాఖలు కానున్నాయి. 20వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేస్తారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి ఒకటిన్నర వరకు నామినేషన్ల పరిశీలన చేపడతారు. మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నామినేషన్ ఒకటే దాఖలైతే ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. ఒకటికి మించి నామినేషన్లు దాఖలైతే ఈ నెల 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక నిర్వహిస్తారు.

బీజేపీ జాతీయాధ్యక్షునిగా జేపీ నడ్డా ఎన్నిక కానున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సన్నిహితుడు. సంఘ్ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రెసిడెంట్‌గా నడ్డా ఎన్నిక లాంఛనమే అని అంటున్నారు. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఈ నెల 20న నడ్డా నామినేషన్ వేయనున్నారు. ఇక, అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో పార్టీ నేతలకు బీజేపీ నాయకత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 20న ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆర్డర్ వేసింది. అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోర్ గ్రూప్ సభ్యులకు అధినాయకత్వం నుంచి సందేశాలు వెళ్లాయి.

బీజేపీలో రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం లేదు. ప్రస్తుత ప్రెసిడెంట్ అమిత్ షా పదవీ కాలం గత ఏడాదే ముగిసింది. కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పదవీకాలాన్ని కాస్త పొడిగించారు. అదే సమయంలో కొత్తగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును సృష్టించి జేపీ నడ్డాకు అప్పగించారు. ఇప్పుడు నడ్డానే పార్టీ ప్రెసిడెంట్‌గా నియమించబోతున్నారు. బీజేపీ పార్టీ రాజ్యాంగం ప్రకారం క్షేత్రస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు పార్టీ అధ్యక్షుల ఎన్నిక జరుగుతోంది. బూత్, మండల, జిల్లా, రాష్ట్రాల అధ్యక్ష ఎన్నిక ముగింపు దశకు చేరుకుంది.

Tags

Read MoreRead Less
Next Story