అమరావతి ప్రాంతంలో 5 వేల మంది పోలీసుల మోహరింపు

అమరావతి ప్రాంతంలో 5 వేల మంది పోలీసుల మోహరింపు

అమరావతిలో టెన్షన్‌ వాతవరణం నెలకొంది. మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ విపక్షాలు, అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అలర్టయ్యారు. ఎక్కడికక్కడ ఆంక్షలతో నిరసనలను అణచివేసేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ, కేబినెట్‌ సమావేశాలకు నిరసన సెగ తాకే అవకాశం ఉందన్న సమాచారంతో అమరావతి ప్రాంతంలో 5 వేల మంది పోలీసులు మోహరించారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర విపక్షాల నేతలతో పాటు రైతులకు నోటీసులు అందజేశారు. నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు పోలీసులు. శ్రీకాకుళంలోని టీడీపీ నేత కూన రవికుమార్‌ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. కూన విజయవాడ బయలుదేరుతున్నారన్న సమాచారంతో పోలీసులు ఆయన్ని నిర్బంధించారు. తన కుమార్తె స్కూల్‌ రీ ఓపెన్‌ సందర్భంగా కుటుంబంతో కలిసి విజయవాడ వెళ్తున్నామని రవి కుమార్‌ చెప్పిన పోలీసులు వినలేదు. దీంతో పోలీసులు, కూన రవికుమార్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా అడ్డుకోవడంపై కూన రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తోందని ఆరోపించారు.

అటు తిరుపతిలోనూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను హౌస్‌ అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన సుగుణమ్మను, టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని సుగుణమ్మ ప్రశ్నించారు.

తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం సీఎం జగన్‌ అసెంబ్లీకి వెళ్లేందుకు ఏకంగా కొత్త రహదారినే అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే దీనిపై కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. కీలకమైన పాయింట్లలో మూడెంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో చెక్‌పోస్టులను పెట్టారు.

వేలాది మంది పోలీసుల మోహరింపు, ఆంక్షలపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మావోయిస్టు ప్రాంతాల్లో కూడా లేని బలగాలను అమరావతిలో మోహరించారని మండిపడ్డారు టీడీపీ నేత దేవినేని ఉమా. తప్పు చేస్తున్నారు కాబట్టే ముఖ్యమంత్రి ఇంతగా భయపడుతున్నారని అన్నారు. 10 వేల మంది పోలీసులతో అసెంబ్లీ పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఉమా ప్రశ్నించారు.

అసెంబ్లీ, కేబినెట్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేబినెట్‌ నోట్స్‌, అసెంబ్లీ బిల్లులు అత్యంత గోప్యంగా తయారవుతున్నాయి. సీఎం క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్‌.. సోమవారం ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించి ప్రభుత్వ వ్యూహంపై చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story