టీఆర్‌ఎస్ పార్టీలోకి వారిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకునేది లేదు : కేటీఆర్‌

టీఆర్‌ఎస్ పార్టీలోకి వారిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకునేది లేదు : కేటీఆర్‌

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకెళుతోంది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రచారంతో హోరెత్తిస్తోంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికంగా రోడ్‌ షోలో పాల్గొన్నారు.

వేములవాడలో పర్యటించిన కేటీఆర్.. రాజన్న పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామనీ హామీ ఇచ్చారు. 400కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఆలయం వివక్షకు గురైందని విమర్శించారు కేటీఆర్.

సిరిసిల్లలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. పట్టణాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాని హామీ ఇచ్చారు. సిరిసిల్ల అంటే ఒకప్పుడు ఉరిశాల అని పేరుండేదని. .కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్‌ పాలనలో సిరిసిల్ల నేతలన్నలకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయని తెలిపారు. గోదావరి నీళ్లను తీసుకొచ్చి సిరిసిల్ల, వేములవాడ బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. బీడీ కార్మికులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పింఛన్లు అందిస్తుందని అన్నారు. సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు ఇతర పార్టీలకు లేదన్నారు కేటీఆర్‌. నాలుగేళ్లలో సిరిసిల్లకు రైలు సౌకర్యం తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటున్నానని మంత్రి హామీ ఇచ్చారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు మాటలు ఎక్కువ.. పని తక్కువ అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. రాబోయే నాలుగేళ్లలో తెలంగాణలోని పట్టణాలను దేశం ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లోకి వస్తామనేవారిని ఎట్టిపరిస్థితుల్లో పార్టీలోకి తీసుకునేది లేదని కేటీఆర్‌ తేల్చి చెప్పారు

Tags

Read MoreRead Less
Next Story