బిచ్చగాడు @ ఇంజనీర్.. కేరాఫ్ గుడిమెట్లు..

బిచ్చగాడు @ ఇంజనీర్.. కేరాఫ్ గుడిమెట్లు..

ఇంజనీర్ అయి ఉండి గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది. చిన్న కారణానికి పెద్ద గొడవ చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. అప్పుడు కానీ అతడి గురించి ప్రపంచానికి తెలిసింది. చిన్నప్పుడే అమ్మానాన్నని కోల్పోయి అనాధాశ్రమంలో చేరాడు. ఆశ్రమ నిర్వాహకుల సాయంతో పై చదువులు చదివాడు. మంచి ఉద్యోగం కూడా వచ్చింది. కొంత కాలం పాటు హైదరాబాద్‌లోని మిల్టన్ కంపెనీలో ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయినా ఏదో నిర్లిప్తత. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లి పోయాడు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన గిరిజా శంకర్ మిశ్రా.

అనాధాశ్రమంలో ఉంటూ బిఎస్సీ పూర్తి చేసి కొంతకాలం ముంబైలో ఉద్యోగం చేశాడు. ప్లాస్టిక్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేశాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు పై అధికారులతో గొడవలు. రాను రాను వ్యవస్థపై నమ్మకం కోల్పోయాడు. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లి పోయాడు. పూరీ జగన్నాథ్ గుడిమెట్ల మీద కూర్చుని అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ రిక్షాపుల్లర్‌తో గొడవ పడ్డాడు. అది కాస్తా తీవ్రం కావడంతో పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది.

ఇద్దర్నీ స్టేషన్‌కు తీసుకువెళ్లి కంప్లైంట్ రాయమన్నారు పోలీసులు. శంకర్ మిశ్రా పేపర్ తీసుకుని ఇంగ్లీష్‌లో చకచకా కంప్లైంట్ రాసి ఇచ్చేసరికి పోలీసులు నోరెళ్లబెట్టారు. పీక్కుపోయిన మొహం, ఎన్నాళ్లనుంచో గీసుగోని గడ్డం.. అచ్చంగా బిచ్చగాడిని తలపించే అతడి వేషధారణ. పోలీసులు అతడిని విచారించి వదిలేశారు. కేసు నమోదు చేయలేదు. శంకర్ గురించిన కథనాలు మీడియాలో రావడంతో ఎన్జీవోలు అతడిని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటు ఉన్న మిశ్రా ఇప్పటికీ స్ట్రీట్ లైట్ల కింద కూర్చొని పేపర్లు, పుస్తకాలు చదువుతుంటాడని స్థానికులు తెలిపారు.

Read MoreRead Less
Next Story