పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన జగన్‌

పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన జగన్‌

వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిన ఏపీ శాసనమండలిని.... ఏకంగా రద్దు చేయాలనే సంచలన ప్రతిపాదన చేశారు సీఎం జగన్‌. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన జగన్‌..... మండలి రద్దు దిశగా అసెంబ్లీలో మాట్లాడారు. సోమవారం సభ నిర్వహించి దీనిపై చర్చిద్దామని స్పీకర్‌ను కోరారు. దీనికి స్పీకర్ తమ్మినేని అంగీకారం తెలిపారు. శాసన మండలిలో బుధవారం జరిగిన పరిణామాలు తనను ఎంతగానో బాధించాయన్నారు సీఎం జగన్. చట్టాలను కాపాడటం కోసం ఎగువ సభలు ఉండాలి కానీ.. అధికార దుర్వినియోగం కోసం కాదన్నారు.

అయితే, ఈ పరిస్థితి జగన్‌కే కాదు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు కూడా ఎదురైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో... 1957 నుంచి శాసన మండలి ఉంది. అయితే... 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ ప్రభుత్వానికి శాసనసభలో పూర్తి మెజారిటీ ఉన్నా... మండలికి వచ్చే సరికి కాంగ్రెస్ హవా కొనసాగింది. టీడీపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు కాంగ్రెస్‌ అడ్డు తగులుతూ వచ్చేది. అప్పట్లో మండలిలో రోశయ్య ఎన్టీఆర్‌ను ఇబ్బందులు పెట్టేవారు. దీంతో ఎన్టీఆర్‌కు చిర్రెత్తుకొచ్చింది. తన ప్రభుత్వాన్ని మండలిలో అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించడాన్ని... ఎన్టీఆర్‌ తట్టులేకపోయారు. అందుకే మండలి రద్దుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఈ తీర్మానాన్ని అప్పటి రాజీవ్‌ ప్రభుత్వం ఆమోదించడంతో 1985లో ఏపీ శాసన మండలి రద్దైంది.

2004లో తిరిగి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మండలి ఏర్పాటు కాలేదు. శాసన మండలిని పునరుద్ధరించాలని భావించిన అప్పటి సీఎం వైఎస్‌ఆర్‌ ... అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం చేత ఆమోదింప చేసుకున్నారు. ఫలితంగా.. 2008లో తిరిగి మరోసారి శాసన మండలి కొలువుదీరింది.

దాదాపు 12 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు మరోసారి మండలి రద్దు దిశగా ప్రతిపాదన చేశారు సీఎం జగన్‌. ఎన్టీఆర్ ను ఇబ్బంది పెట్టిన మండలి... ఇప్పుడు చంద్రబాబుకు కలిసి రాగా, తండ్రి వైఎస్‌ఆర్ తిరిగి తీసుకొచ్చిన అదే మండలి ఇప్పుడు కుమారుడు జగన్‌ ని ఇబ్బంది పెడుతోంది. దీంతో సీఎం జగన్‌... మండలి రద్దు దిశగా కసరత్తులు చేస్తున్నారు.

ప్రతి రెండేళ్లకోసారి మండలిలో మూడొంతుల మంది సభ్యులు రాజీనామా చేస్తారు. వారి స్థానంలో కొత్త సభ్యులు బాధ్యతలు చేపడతారు. స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, గవర్నర్, గ్రాడ్యుయేట్లు, టీచర్లు కోటాల్లో ఎమ్మెల్సీలను ఎన్నుకొంటారు. 2021 జూన్ వరకు మండలిలో టీడీపీ ఆధిపత్యమే కొనసాగుతుంది. దాదాపు ఏడాదిన్నరపాటు జగన్ ఓపిక పడితే.. మండలిలోనూ వైఎస్సార్సీపీ బలం పెరుగుతుంది. అయితే అప్పటి దాకా సీఎం జగన్ ఓపికతో వ్యవహరించే పరిస్థితి కనిపించడం లేదు.

అయితే... మండలి రద్దు అంత సులభం కాదు. దీనికి పార్లమెంట్ అంగీకారం కూడా అవసరం. మండలిని రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే.. అది ఎంత త్వరగా పార్లమెంట్ ముందుకు తీసుకొస్తుందనేది కేంద్రం ఆసక్తిని బట్టి ఉంటుంది. కేంద్రం అంతగా ఆసక్తి చూపకపోతే.. మండలి రద్దుకు ఏడాది పట్టొచ్చు. అదే జరిగితే వైసీపీ బలం పెరిగే సమయానికి మండలి రద్దవుతుంది. శాసన మండలి ఏర్పాటును రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 నిర్వచిస్తుంది. ప్రస్తుం దేశంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లలో.... శాసనమండళ్లు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story