గగన్‌యాన్ ప్రయోగానికి శరవేగంగా ఏర్పాట్లు

గగన్‌యాన్ ప్రయోగానికి శరవేగంగా ఏర్పాట్లు

ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ ప్రయోగానికి కూడా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గగన్‌యాన్ మిషన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాములు ఈ నెల చివర్లో రష్యాకు వెళ్లనున్నారు. అక్కడ వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 1984లో స్క్వాడ్రన్ లీడర్ రాకేష్‌ శర్మ రష్యన్‌ మాడ్యూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లగా, ఈసారి భారతీయ వ్యోమగాములు స్వదేశీ మాడ్యూల్‌ లోనే రోదసీలోకి వెళ్లనున్నారు. అంతరిక్షంలోని మానవులను పంపడమే గగన్‌యాన్ ప్రధాన లక్ష్యం. ఐతే, ఈ ప్రయోగానికి ముందు రెండు మానవ రహిత ప్రయోగాలు జరగనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో, వచ్చే ఏడాది జూన్‌లో రెండు మానవ రహిత మిషన్ల ను ఇస్రో నిర్వహించనుంది. ఆ రెండు ప్రయోగాల అనంతరం 2021 డిసెంబర్‌లో మానవ సహిత అంతరిక్ష యాత్ర జరుగుతుంది.

మానవ రహిత గగన్‌యాన్ మిషన్‌ కోసం ఇస్రో ఓ హ్యూమనాయిడ్‌ను తయారు చేసింది. ఆ రోబో పేరు వ్యోమమిత్ర. మాన‌వ శ‌రీరంలోని అవ‌య‌వాల ప‌నితీరును ప‌రీక్షించడానికి ఈ హాఫ్ హ్యుమ‌నాయిడ్‌ను పంప‌నున్నారు. నింగిలోకి ఓ రోబోను పంపించి, ఎప్పటిక‌ప్పుడు రిపోర్ట్‌ తీసుకుంటారు. వ్యోమ‌మిత్ర మామూలు రోబో కాదు. దానికంటూ కొన్ని ప్రత్యేకతలున్నాయి. మిమిక్రీ చేయ‌గ‌ల‌దు. మ‌నుషులతో మాట్లాడగలదు. చంద్రమండలానికి భారతీయులను పంపే ప్రయత్నాలు ఇప్పటికిప్పుడు సాధ్యం కావని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ పేర్కొన్నారు. ఐతే, ఏదో ఒక రోజు ఆ కల సాకారమవుతుందని అన్నారు.

చంద్రయాన్-3 మిషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈసారి ప్రయోగాన్ని సక్కెస్ చేయాలని ఇస్రో బృందం పట్టుదలగా ఉంది. చంద్రయాన్-2లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ, కొత్త టెక్నాలజీతో చంద్రయాన్-3ని పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రయాన్‌–2లో మాదిరిగా చంద్రయాన్‌–3లోనూ ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ ఉంటాయి. చంద్రయాన్‌–2లో ఆర్బిటర్‌ మిషన్‌ జీవితకాలం 7 సంవత్సరాలు. అదే ఆర్బిటర్‌ను చంద్రయాన్‌–3లోనూ ఉపయోగిస్తారు. చంద్రయాన్-3 ల్యాండర్ నిర్మాణానికి 250 కోట్లు ఖర్చయ్యాయి. ప్రయోగానికి 350 కోట్ల వరకు ఖర్చు అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story