జేడీయూలో ముస‌లం.. పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడి మధ్య వివాదం

జేడీయూలో ముస‌లం.. పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడి మధ్య వివాదం
X

జేడీయూలో ముస‌లం మొద‌లైంది. పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడి మధ్య వివాదం ముదిరింది. పార్టీ తీరును తప్పుబట్టిన సీనియర్ నాయకునిపై అధ్యక్షునికి కోపం వచ్చింది. ఉంటే ఉండు పోతే పో అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చని ముఖం మీదే చెప్పేశారు. ఎక్కడ ఉన్నా తన ఆశీస్సులు ఉంటాయని, ఇకపై మీ ఇష్టం అని కుండబద్దలు కొట్టారు. పార్టీ బాసే తీవ్రంగా స్పందించడంతో సీనియర్ నాయకుడు సైలెంట్ ఐపోయారు.

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలపై జేడీయూలో వివాదం చెలరేగింది. సీఏఏను జేడీయూ సమర్దించింది. పార్లమెంట్‌లో బిల్లుకు అనుకూలంగా ఓటు వేసింది. ఈ నిర్ణయాన్ని జేడీయూ సీనియర్ నాయకుడు పవన్ వర్మ వ్యతిరేకించారు. సీఏఏపై పార్టీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీతో పొత్తును తెంచుకోవాలని ఒత్తిడి చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రతిపాదించారు. పార్టీ నాయకత్వం తన సూచనలను పట్టించుకోకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవడానికి కూడా సిద్ధమని బెదిరించే ప్రయత్నం చేశారు.

బెదిరింపులతో పార్టీని తన దారిలోకి తెచ్చుకోవాలనుకున్న పవన్ వర్మ ఎత్తుగడ బెడిసికొట్టింది. పవన్‌కు JDU చీఫ్ నితీష్ కుమార్‌ ఊహించని షాక్ ఇచ్చారు. తనకు రాసిన లేఖను పవన్ వర్మ బయట పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వ్యక్తిగత సంభాషణలను బాహటంగా వెల్లడించడం మంచి పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చని పవన్‌ వర్మకు స్పష్టంగా చెప్పారు.

జేడీయూ నాయకులు కూడా పవన్ వర్మ తీరును తప్పుబట్టారు. పార్టీ చీఫ్‌కు రాసిన లేఖను బయటపెట్టడాన్ని జేడీయూ శ్రేణులు తప్పుబట్టాయి. సీనియర్ నాయకుడై ఉండి, అధినాయకునితో జరిగిన వ్యక్తిగత సంభాషణను ఎలా బయటపెడతారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు పవన్ వర్మ నుంచి సంతృప్తికర సమాధానం రాలేదు. మరి, పవన్ వర్మ జేడీయూలో కొనసాగుతారా..? లేక వేరే పార్టీలో చేరి పోతారా..? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

Next Story

RELATED STORIES