కారు స్పీడులో కొట్టుకుపోయిన ప్రతిపక్షాలు

కారు స్పీడులో కొట్టుకుపోయిన ప్రతిపక్షాలు

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరుగా దూసుకెళ్తోంది. ప్రతిపక్షాలు దాని స్పీడులో కొట్టుకుపోయాయి. పోటీకాదు కదా కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. మొత్తం 120 మున్సిపాలిటీల్లో 107 టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ 7, బీజేపీ 2, ఎంఐఎం 2, ఇతరులు 2 మున్సిపాలిటీల్లో విజయం సాధించారు.

కానీ పోటీచేసిన ఇతర పార్టీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో టీఆర్ఎస్ కు వార్డులు, డివిజన్లు భారీగా తగ్గిపోయాయి. మొత్తం 2 వేల 727 వార్డులు ఉన్నాయి. వీటిలో టీఆర్ఎస్ ఒక వేయి 509 వార్డులను గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ 500, బీజేపీ 224, ఎంఐఎం 60, ఇతరులు 296 వార్డుల్లో విజయం సాధించారు.

అటు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ కారుదే జోరు. తెలంగాణలో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లు 9 ఉంటే..వాటిలో 325 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా పోటీచేసిన

ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో టీఆర్ఎస్ కు డివిజన్లు భారీగా తగ్గిపోయాయి. టీఆర్ఎస్ కు 130, కాంగ్రెస్ కు 37, బీజేపీకి 48, ఎంఐఎంకు 10, ఇతరులకు 41 డివిజన్లు దక్కాయి.

మున్సిపల్ కార్పొరేషన్లలోనూ కారు స్పీడుగా దూసుకెళ్తోంది. పీర్జాదీగూడ, బండ్లగూడ, మీర్ పేట, బోడుప్పల్ కార్పొరేషన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బండ్లగూడ జాగీర్లోని 22 డివిజన్లకుగాను టీఆర్ఎస్ 14 డివిజన్లు సొంతం చేసుకుంది. అటు మీర్ పేటలోని 46 డివిజన్లకుగాను టీఆర్ఎస్ 19 తన ఖాతాలో వేసుకుంది. బోడుప్పల్ లోని 28 డివిజన్లకుగాను టీఆర్ఎస్ 14 డివిజన్లలో విజయం సాధించింది. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్లో 26 డివిజన్లు ఉన్నాయి. వాటిలో టీఆర్ఎస్ 16 డివిజన్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక నిజాంపేట కార్పొరేషన్లోనూ కారు జోరు కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఫలితాలు వెలువడిన వార్డుల్లో ఎనిమిదింటిని గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. కానీ నిజామాబాద్ కార్పొరేషన్లో మాత్రం కారు వెనుకబడింది. ఇక్కడ ఇప్పటిదాకా ఖాతా తెరవలేదు. 15 చోట్ల మాత్రం ఆధిక్యంలో ఉంది. అయితే నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ, ఎంఐఎం మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ఇక్కడ ఇప్పటిదాకా బీజేపీ 16 డివిజన్లలో విజయం సాధించింది. ఇక ఎంఐఎం 9 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించింది.

Tags

Read MoreRead Less
Next Story