జేఏసీ కీలక నిర్ణయం.. అమరావతిలో ఆందోళనలు ఉధృతం..

అమరావతి ఆందోళనలు ఇంకాస్త ఉధృతమవుతూనే ఉన్నాయి.. ప్రభుత్వం రైతుల ఆందోళనలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రాజధాని తరలింపుపై ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించింది. ఆ బిల్లుకు మండలిలో బ్రేక్‌లు పడింది. దీంతో మండలినే ఏకం రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి మండలిపై రద్దుపై తీర్నానం చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆందోళనలను ఇంకాస్త ఉధృతం చేయాలని అమరావతి పరిరక్షణ జేఏసీ నిర్ణయించింది..
అమరావతిని కాపాడుకునేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతాం అంటున్నారు రాజధాని రైతులు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు ఇవాళ 41వ రోజుకు చేరాయి. స్వార్థ రాజకీయాల కోసమే వైసీపీ ప్రభుత్వం 3రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. రాజధానిని మార్పుచేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. తుళ్లూరు, మందడంలో మహాధర్నాలను ఇవాళ కొనసాగించనున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెం, యర్రబాలెంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించనున్నారు. అమరావతి ప్రాంత రైతులకు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ, ప్రకాశం, హైదరాబాద్ తదితర ప్రాంతాలవారు బాసటగా నిలుస్తున్నారు. ఎన్నారైలు సంఘీభావం తెలపటంతో పాటు భారీమొత్తంలో విరాళాలు అందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com