అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేయనున్న స్వామీజీలు

అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేయనున్న స్వామీజీలు

భారత ప్రధాని మోదీ అమరావతికి శంకుస్థాపన ఉద్దండరాయుని పాలెంలో నాలుగేళ్ల తర్వాత మళ్లీ వేద ఘోష వినిపించింది. నాడు రాజధానిగా అమరావతిని నిర్ణయించి శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులు నిర్వహిస్తే.. ఇప్పుడు రాజధాని తరలిపోకూడదన్న ఉద్దేశంతో తొమ్మిది రోజులపాటు శ్రీపాశుపత సంపుటీకరణ మహా కాలభైరవ యాగం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా సాగింది. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజధాని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చారు.

అంతకు ముందు 13 జిల్లాల పీఠాధిపతులు సమావేశం నిర్వహించారు. అమరావతి రాజధానిగా ఉండాలని విశ్వధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. 29 రాజధాని గ్రామాల దేవతల ఆశీస్సులతో తిరుపతి నుంచి పాదయాత్ర నిర్వహించాల నిర్ణయించారు. అలాగే 150 మంది స్వామీజీలు, 13 జిల్లాల్లో మహాపాదయాత్ర నిర్వహించనున్నారు. అమరావతి రాజధానిగా ఉండాలంటూ ప్రధాని మోదీకి తీర్మాన ప్రతులు ఇవ్వనున్నారు. ఇక శ్రీకాకుళం నుంచి స్వామీజలంతా వందల సంఖ్యలో సమావేశాలు పెడుతూ అనంతరం ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. 13 జిల్లాల్లోనూ సమావేశాలతోపాటు.. కోర్టుల ద్వారా పోరాటం చేయాలని స్వామీజీలు తీర్మానించారు. అమరావతి కోసం తమ‌ వంతు కృషి‌ చేస్తామన్న శివస్వామి.. త్వరలో తిరుపతిలో లక్ష మందితో మహాసభ నిర్వహిస్తామని ప్రకటించారు.

రాజధాని గ్రామాల ప్రజలు చేపట్టిన పోరాటం40వ రోజుకు చేరింది. రైతులు, మహిళలు, యువకులు నిరసనలు తెలుపుతున్నారు. మందడం, తుళ్లూరులో రైతులు మహాధర్నా నిర్వహించారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం సహా రాజధాని గ్రామాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. జాతీయ పతాకాలను చేతబట్టి రైతులు, మహిళలు ఉద్యమిస్తున్నారు. అమరావతి ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తోంది. రాజధాని గ్రామాలే కాదు.. చుట్టుపక్కల ఊళ్ల నుంచి కూడా జనం ట్రాక్టర్లలో వచ్చి.. రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా జరుగుతున్న అమరావతి న్యాయపోరాటంలో అందరూ భాగస్వామ్యం అవుతున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా మద్దతు లభిస్తుండటంపై అమరావతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story