తాజా వార్తలు

పబ్లిసిటీ ట్రిక్స్ పల్లెప్రగతిలో ఫాలో కావొద్దు : సీఎం కేసీఆర్ వార్నింగ్

పబ్లిసిటీ ట్రిక్స్ పల్లెప్రగతిలో ఫాలో కావొద్దు : సీఎం కేసీఆర్ వార్నింగ్
X

పరిశుభ్రత లక్ష్యంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు కామన్ గానే ఫోటో షూట్ కార్యక్రమాలుగా మారుతుంటాయి. లేని చెత్తని వేయించి మరీ చీపురుతో ఫోజులిచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. అలాంటి పబ్లిసిటీ ట్రిక్స్ పల్లెప్రగతిలో ఫాలో కావొద్దని వార్నింగ్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ప్రగతిభవన్ లో పల్లెప్రగతిపై సమీక్ష నిర్వహించిన ఆయన..గ్రామపంచాయితీల్లో అవసరమైన సిబ్బందిని నియమించామని గుర్తు చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఫోటోలకు ఫోజుల ఇవ్వటం మానేసి సిబ్బందితో పనిచేయిస్తే చాలని అన్నారు. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో వుండాలనే లక్ష్యంతా అమలు చేస్తున్న పల్లె ప్రగతి మరింత పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు. అంతేకాదు..గ్రామాల్లో పల్లె ప్రగతి అమలును పరిశీలించేందుకు త్వరలోనే ఆకస్మిక పర్యటనలు నిర్వహిస్తామన్నారు సీఎం.

హైదరాబాద్ లో పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న బస్తీ దావఖానాల సంఖ్యను 350కి పెంచాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. నగరంలో ప్రస్తుతం ఉన్న 118 బస్తీ దావఖానాలు బాగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. సిటీలోని 150 డివిజన్లలో ప్రతీ డివిజన్ కు రెండు చొప్పున బస్తీ దావఖానాలు ఉండాలని, రాబోయే నెలరోజుల్లోనే కొత్త దావఖానాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

అనంతరం మెడారం జాతర ఏర్పాటు పనులపై సమీక్షించిన సీఎం.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి మేడారం జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులు మేడారం వెళ్లి, ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించడానికి, ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు హైదరాబాద్ లో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. జాతరకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగతి భవన్ లో కేసీఆర్ కు అందించారు. ముఖ్యమంత్రిని మేడారం జాతరకు ఆహ్వానించారు.

మేడారం జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షల సంఖ్యలో తరలిరానున్నందున.. మంచినీరు, పారిశుధ్యం తదితర విషయాల్లో ఏమాత్రం ఏమరపాటు మంచిది కాదని హెచ్చరించారు. క్యూలైన్ల నిర్వహణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తదితర అంశాల్లో సరైన వ్యూహం అనుసరించాలని కేసీఆర్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గతంలో వరంగల్ జిల్లాల్లో పనిచేసి, మేడారం జాతర నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అక్కడికి పంపించాలని సూచించారు. అన్ని శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో వ్యవహరించి జాతరను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Next Story

RELATED STORIES