హాజీపూర్ వరుస హత్యలపై నేడు తుది తీర్పు

హాజీపూర్ వరుస హత్యలపై నేడు తుది తీర్పు

హాజీపూర్ గ్రామానికి చెందిన బాలికల హత్య కేసులో నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ రోజు తుది తీర్పును వెలువరించనుంది. నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిపై ముగ్గురు బాలికలపై హత్యాచారం కేసులు నమోదు కాగా, ఈ నెల 8 నాటికి ఒక కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. అయితే, మరో రెండు హత్యల కేసుల్లో వాదనలు వినకుండానే తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. స్కూలు విద్యార్ధులను బలితీసుకున్న సైకో శ్రీనివాసరెడ్డిని ఉరి తీయాల్సిందేనని హాజీపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దిశ కేసులో ఎన్ కౌంటర్ తర్వాత..తమకు అలాంటి జస్టిస్ కావాలని ఆందోళనలు కూడా చేసిన నేపథ్యంలో ఇవాళ్టి విచారణలో ఎలాంటి తీర్పు వస్తుందనేది ఉత్కంఠ నెలకొంది.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌ గ్రామంలో గత ఏడాది ఏప్రిల్ లో స్కూల్ విద్యార్ధిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు శ్రీనివాస రెడ్డి. అయితే..ఈ కేసులో విచారణ మొదలుపెట్టిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. గతంలో మరో ఇద్దరిపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లు తేలింది. 2015 ఏప్రిల్‌లో జరిగిన మొదటి హత్య ఏడాది మార్చిలో రెండో మర్డర్ జరిగింది. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. మైనర్ బాలిక అత్యాచారం, హత్య జరిగిన 60 రోజుల వ్యవధిలోనే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 300 మంది సాక్షులను ఇందులో పేర్కొన్నారు.ముగ్గురు బాలికల పోస్ట్ మార్టం నివేదిక, డీఎన్ఏ రిపోర్టులు, స్థానికంగా దొరికిన ఆధారాలు వీటిలో పొందుపరిచారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితుడైన శ్రీనివాస్ రెడ్డి వాంగ్మూలాన్ని సైతం గత నెలలో రికార్డు చేశారు.

మరోవైపు కొమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో నవంబర్‌ 24న జరిగిన సమత హత్య కేసులోనూ ఇవాళ తుది తీర్పు వెలువడనుంది. ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కలిచివేసింది. ప్రభుత్వ చొరవతో హైకోర్టు ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేయగా..20 రోజుల్లోనే దర్యాప్తును పూర్తిచేసిన పోలీసులు.. 44 మంది సాక్షులను విచారించి.. 140 పేజీల ఛార్జిషీటును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు సమర్పించారు. జడ్జిమెంట్‌ నేపథ్యంలో ఏ తీర్పు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు గ్రామస్థులు.

Tags

Read MoreRead Less
Next Story