కేంద్రం కోర్టులోకి వెళ్లనున్ను ఏపీ శాసనమండలి రద్దుబిల్లు.. ఆమోదం పొందుతుందా?

కేంద్రం కోర్టులోకి వెళ్లనున్ను ఏపీ శాసనమండలి రద్దుబిల్లు.. ఆమోదం పొందుతుందా?

సీఎం జగన్‌ అనుకున్నదే చేశారు. ఈ పేద రాష్ట్రానికి శాసన మండలి అవసరమా అన్న జగన్‌.. అసెంబ్లీలో అవసరం లేదనే తేల్చేశారు. శాసనసభలో సీఆర్‌డీఏ, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును పాస్‌ చేసుకున్న ఏపీ ప్రభుత్వం.. మండలిలో తన మాట చెల్లుబాటు కాలేదు. బిల్లును కౌన్సిల్ పరిగణలోకి తీసుకోకపోగా దాన్ని సెలెక్ట్‌ కమిటీకి పంపించింది. దీంతో ఆగ్రహించిన సీఎం జగన్‌ ఏకంగా మండలి రద్దుకే సై అన్నారు. సోమవారం ఉదయం క్యాబినెట్‌లో రద్దు తీర్మానాన్ని ఆమోదించిన ప్రభుత్వం.. ఆ వెంటనే దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. సభకు హాజరైన 133 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. మండలి రద్దు తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

రాజకీయ కారణాలతో ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను అడ్డుకునే సభ అవసరం లేదన్నారు సీఎం జగన్‌. అలాంటి సభ కోసం ప్రజాధనం ఖర్చు చేయడం దండగ అన్నారు. శాసనమండలిని రద్దు చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నట్టు తెలిపారు జగన్‌.

మండలి రద్దు అధికారాన్ని రాజ్యాంగం అసెంబ్లీకే ఇచ్చిందని సీఎం గుర్తుచేశారు. కొన్నాళ్లు పోతే అక్కడ వైసీపీకే ఆధిక్యం వస్తుందని.. అయినా కీలక బిల్లులపై కాలయాపన తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. అలాంటి సభను రద్దు చేయాలని తీర్మానం పెట్టడం సంతోషంగా ఉందని జగన్ స్పష్టంచేశారు.

151 మంది ఎమ్మెల్యేల్లో అసెంబ్లీకి 133 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. జనసేన ఎమ్మెల్యే రాపాక సైతం తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరవడం ఆసక్తికరంగా మారింది. ఓటింగ్‌ సమయంలో 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడంపై సీఎం జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చివరికి విప్‌లు చెవిరెడ్డి, దాడిశెట్టి రాజా కూడా ఓటింగ్‌ సమయంలో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఏపీ అసెంబ్లీ.. మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేయగా.. ఇప్పుడు ఈ అంశం కేంద్రం కోర్టులోకి వెళ్లింది. మొదటగా రద్దు బిల్లును కేంద్ర హోం శాఖకు పంపుతారు. ఆ తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. లోక్‌సభతో పాటు రాజ్యసభ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఉభయ సభల నిర్ణయాన్ని బిల్లు రూపంలో రాష్ట్రపతికి పంపుతారు. ఇక్కడ రాష్ట్రపతి నిర్ణయం కీలకం కానుంది. ఆయన కూడా బిల్లుపై సంతకం చేస్తే అప్పుడు శాసనమండలి రద్దు అవుతుంది. అయితే ఈ పక్రియ అంతా అనుకున్నట్లు జరిగితే కనీసం మూడు నెలలు లేదా ఏడాది సమయం పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఏపీలో బలమైన పార్టీగా ఎదగాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో శాసనమండలి రద్దుకు కేంద్రం ఆమోదం తెలుపుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story