ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు కీలక ఆదేశాలు

పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు ఉండకూడదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వైసీపీ రంగులను తొలగించాలని ఆదేశించింది. అటు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయంపై విచారించిన కోర్టు.. దీనిపై ముందుకు వెళ్తే సంబంధిత అధికారులే బాధ్యత వహిస్తారని తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు హైకోర్టు వాయిదా వేసింది.

పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని.. వాటికి పార్టీ రంగులు ఉండకూదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వైసీపీ రంగులను తొలగించాలని ఆదేశించింది. గుంటూరు జిల్లాలో పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగు వేశారంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని, కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కి వాయిదా వేసింది.

అటు.. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేసే విషయంలో ముందుకు వెళుతోందని, దీనివల్ల నిధులు దుర్వినియోగం అవుతాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై ముందుకు వెళ్తే సంబంధిత అధికారులే బాధ్యత వహిస్తారని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు హైకోర్టు వాయిదా వేసింది.

మరోవైపు.. కమర్షియల్‌ భవనాల్లో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ రుసుము తీసుకుంటే తిరిగి వసూలు చేయమని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కమర్షియల్‌ భవనాల్లో ఏపీ అపార్ట్‌మెంట్ యాక్ట్‌.. సెక్షన్ 31కి విరుద్ధంగా పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్నారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్‌ జేసీలు, అన్ని మల్టీఫ్లెక్స్‌ల యజమానులను ప్రతివాదులకు చేర్చారు. దీనిపై విశాఖ జేసీకి వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ కోర్టుకు తెలిపారు. ఏపీలో అందరూ జేసీలకు వినతిపత్రం ఇవ్వాలన్న హైకోర్టు.. దీనిపై జేసీలు పరిశీలించి.. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ రుసుము వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకు వసూలు చేసిన రుసుమును తిరిగి రాబట్టాలని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story