విజృంభిస్తున్న కరోనా వైరస్‌

విజృంభిస్తున్న కరోనా వైరస్‌

చైనాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటివరకు చైనాలో ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 80కి చేరింది. మరో 2 వేల 744 మందిలో వైరస్ లక్షణాలు గుర్తించినట్లు చైనా ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. వారిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. కరోనా వైరస్ కారణంగా రక్షణ చర్యల్లో భాగంగా టిబెట్ కు చెందిన ఆధ్యాత్మిక గురువు దలైలామా అధికారిక నివాసమైన పొటాలా ప్యాలెస్ ను సైతం సోమవారం మూసివేశారు. కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా.. దీనిపై యుద్ధం చేసేందుకు చైనా ఆర్థిక శాఖ 1 బిలియన్ డాలర్ల నుంచి ఆ మొత్తాన్ని 9 బిలియన్ డాలర్లకు పెంచింది. కరోనాను నియంత్రించడానికి.. వైరస్‌కు మూలకేంద్రంగా భావిస్తున్న వూహాన్‌ నగరంలో కొత్తగా ఇంకో ఆసుపత్రిని నిర్మించడానికి సిద్ధమైంది. 2 వారాల్లోపు వెయ్యి పడకలతో మరో ఆస్పత్రి కడతామని ప్రభుత్వం తెలిపింది. చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగుచూసిన కరోనా వైరస్‌ క్రమంగా మిగతా నగరాలకూ వ్యాపిస్తోంది. బీజింగ్‌లో 51, షాంఘైలో 40 కేసులు నమోదయ్యాయి.

చైనాలోని భారతీయుల యోగక్షేమాలను బీజింగ్‌లోని మన ఎంబసీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని విదేశాంగ మంత్రి జైశంకర్‌ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ విద్యార్థి శనివారం కరోనా వైరస్‌ లక్షణాలతో ఫీవర్‌ ఆస్పత్రిలో చేరాడు. అతడు ఇటీవల చైనా నుంచి వచ్చాడు. వైద్యులు అనుమానిత కరోనా కేసుగా భావించి.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్‌ వార్డులో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మరో రెండు కరోనా అనుమానిత కేసులు వచ్చాయి. అటు.. కేంద్ర వైద్య బృందం హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఫివర్‌ ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రులను కేంద్ర వైద్యబృందం పరిశీలించనుంది. ఇప్పటికే.. కరోనా సోకిన రోగుల వార్డులు ఎలా ఉండాలి అనేదానిపై వైద్యులకు కేంద్ర బృందం పలు సూచనలు చేసింది.

చైనా నుంచి ఇటీవలే భారత్ కు తిరిగి వచ్చిన ఒక బిహార్ యువతి కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. జనవరి 22న చైనా నుంచి కోల్ కతాకు చేరిన ఈ విద్యార్థిని, ఆ తరువాతి రోజు బిహార్ లోని తన స్వగ్రామానికి చేరుకుంది. రెండు రోజుల అనంతరం దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్టు చెప్పింది. ఈ విషయాన్ని పుణెలోని ఆమె సోదరి వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు హెల్ప్ లైన్ ద్వారా తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు చైనా నుంచి తిరిగి వచ్చిన ఓ రాజస్థాన్ వైద్యుడికి కూడా ఈ వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. ఆయన రక్తనమూనాలను పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. కేరళ, మహారాష్ట్రల్లో 100 మందికి పైగా కరోనా అనుమానితులను వైద్య పర్యవేక్షణలో ఉంచారు. విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 137 విమానాల్లో దేశానికి తిరిగి వచ్చిన 29 వేల 7 వందల మంది ప్రయాణికులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఈ వైరస్ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటికే సమీక్ష నిర్వహించింది.

విదేశాల్లోనూ కరోనా కలకలం రేపుతోంది. హాంగాంగ్, తైవాన్, మకావుల్లో 17 మందిలో వైరస్ ఆనవాళ్లు ధ్రువీకరించారు. థాయ్‌లాండ్‌లో ఏడుగురు, ఆస్ట్రేలియా, సింగపూర్‌లలో నలుగురు చొప్పున, అమెరికాలో ముగ్గురు, జపాన్, ఫ్రాన్స్, మలేషియాల్లో ముగ్గురు, వియత్నాం, నేపాల్‌లలో ఒక్కరు చొప్పున ఈ వైరస్ బారిన పడినట్లు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story