సినీ పూదోటలో విరిసిన కుసుమం 'వేటూరి' జయంతి స్పెషల్..

సినీ పూదోటలో విరిసిన కుసుమం వేటూరి జయంతి స్పెషల్..

తెలుగు పాటకు ఆయన చిరునామా.. తెలుగు పాటే ఆయనకు చిరునామా.. సంస్కృతభూయిష్టమైన సమాసాలను అందంగా పొదిగి, సరళమైన పాటగా మార్చి అందించినా.. లళిత శృంగార భావాలను మనోహరంగా కూర్చి అందమైన పాటగా మలచినా.. మొరటు పదాలకు జానపద పలుకులను నేర్పుగా అల్లి మసాలా కూర్చి మెప్పించినా... రాలిపోయే పూవుకు రాగాలెందుకంటూ శ్రోతల గుండెల్ని పిండి ఏడిపించినా .. అది వేటూరి కలానికే చెల్లింది. ఇవాళ పాటూరి రారాజు వేటూరి జయంతి..

ఆ కలం ముద్దమందారం పై వాలిన సీతాకోక చిలుక.. సిరిసిరిమువ్వల నాదమైంది.. సితారగానమైంది.. శంకరాభరణం ధరించి సాగరసంగమమైంది. సరికొత్త పదాల అన్వేషణలో సప్తపదులు దాటుకుని మధురమైన పదాలకు పాటలు వేసింది. ఆ కలం వేటూరిది.. ఆ పాట తెలుగు పాటకు శాశ్వత సంతకం. ఆ సంతకాన్ని తనదైన పదాలతో వేసిన గడసరి.. పదసిరి.. వేటూరి..

బాధల్నీ, విషాదాల్నీ, ఆనందాల్నీ గాయకుల స్వరాల్లో నింపి తెలుగు సినిమా పాటకు ఓ సొగసిరినీ, సౌందర్యాన్ని, పరిపూర్ణత్వాన్ని తెచ్చిన కలం వేటూరి సుందరరామ్మూర్తిది. సందర్భోచితమైన భావాలను సరళమైన పదాలతో పేర్చి శ్రోతల్ని తన సాహితీ రసజ్ఞతతో ముంచి వేయడం వేటూరి ప్రత్యేకత.

ఆయన కలం నుంచి జాలువారిన తెలుగు పదం హొయలు పోయింది. లయలుగా మారింది. సరికొత్త సొగసులను అందిపుచ్చుకుని... తెలుగు పాటకు వన్నెలు అద్ది.. చిన్నెలు నేర్పింది. సంప్రదాయం, యవ్వనం, విరహం, భక్తి, రక్తి, వేదాంతం, వైరాగ్యం.. ఇలా .. భావమేదైనా అది వేటూరి కలంలో పడితే అద్భుతమైన గేయమవుతుంది. మధురగానమై ప్రాణం పోసుకుంటుంది. అవ్యాక్తానుభూతులను కూడా అతి చిన్న పదాలతో ఆకట్టుకునేలా చెప్పడం వేటూరికే చెల్లింది..

కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఓ సీతకథ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు వేటూరి. తనలోని పదసంపద జ్ఞానానికి బాణీలు అద్ది, ఆ బాణీలతో తెలుగు పాటకు ఓణీలు వేయించారు. సంప్రదాయ కీర్తనలే కాదు, పురాణ సాహిత్యంలోని మాటలనూ తీసుకుని వాటిని అందమైన పాటలుగా మలచడంలో వేటూరిని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదేమో..

వేటూరి కలంలో శృంగారపు సిరా పాళ్లు కూసంత ఎక్కువే కనిపిస్తాయి. అందుకే గానమూ ప్రాణమూ నీవేనని శంకరుణ్ని ఆరాధించిన ఆ కలమే.. ఆరేసుకోబోయి పారేసుకుని.. పారేసుకోవాలనే ఆరేసుకున్నాననే చిలిపి దనాన్నీ చిలకరిస్తుంది. ఇలాంటి పాటలను కూడా అంత అందంగా ఇంకెవరూ రాయలేకపోయారు.. అప్పుడే కాదు.. ఇప్పటికీ..

నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా.. తరించిపోతుంది ఆ పట్టుపురుగు జన్మ అంటూ వేటూరి రాస్తే..ఆ భావానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదా పట్టుపురుగు. ఇలాంటి పద ప్రయోగాలు చేయడం అంటే వేటూరికి పాళీతో పెట్టిన విద్య. ఇలా మాటల్నీ మంత్రాలుగా చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడంలో వేటూరి సిద్ధహస్తుడు.

వేటూరి భావానికి నాటి సంగీత దర్శకులు అద్భుతమైన స్వర ప్రస్థానం కట్టబెట్టారు. హార్ట్ బీట్ ను కదిలించేదైనా.. ఫాస్ట్ బీట్ తో హార్ట్ బీట్ ను పెంచేదైనా ఆయన అక్షరాలను నాటి సంగీత దర్శకులు సమకూర్చిన స్వరాల స్థానం కూడా చాలా ప్రత్యేకమైనదే. ముఖ్యంగా చిరంజీవి సినిమాల్లోని పాటల్లోని వేగానికి తగ్గట్టుగా వేటూరి కలమూ పరుగులు పెడుతుంది.

తెలుగు పదకవితా పితామహుడు అన్నమయ్యే అచ్చెరువొందేలా.. ఆయన జననాన్నే అత్యద్భుతంగా అక్షరీకరించాడు వేటూరి. తెలుగు పదానికి జన్మదినం..ఇది జానపదానికి జ్ఞానపదం, ఏడు స్వరాలే ఏడుకొండలై వెలసిన కలియుగ విష్ణుపదం.. సాక్షాత్ శ్రీనివాసుడే అన్నమయ్యకు ప్రాణం పోసిన వైనాన్ని అల వైకుంఠం నుంచి ఆ ప్రాణం ఇట అమ్మ గర్భాన్ని చేరేవరకూ.. అన్నమయ్య ఎదుగుతోన్న విధానాన్ని ఓ అద్భుతమైన భావావేశంతో రాశారు వేటూరి.

మంచుతాకి కోయిల మౌనమైన వేళా... రాలేటి పూల రాగాలతో పూసేటి పూలగంధాలతో ఆమనీ పాడవే హాయిగా అంటాడు. మంచు కురిసే వేళలో మల్లెవిరిసేదెందుకో అంటూ తొలి ప్రేమ చిగురించే వైనానికి ప్రకృతిని ఆసరా చేసుకుంటాడు. నిజంగానే ఆ పాట వింటుంటే మనం కూడా తెలియకుండానే ఏ మంచు కొండల నడుమనో ఉండిపోయి.. లేని మల్లెలను ఊహించుకుంటూ.. ఉంటాం.

రాలిపోయే పూవుకు రాగాలెందుకు.. వాలిపోయే పొద్దుకు వర్ణాలెందుకు అంటూ వేటూరి కలం ఝళిపిస్తే కన్నీరు పెట్టకుండా ఉండగలమా.. వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి .. అంటే మధ్యలో వినిపించే గానమే జీవితమా.. ఇలాంటి పదాలను రాస్తున్నప్పుడు అందులోని కష్టం తను అనుభవిస్తూ.. అనుభూతిని మనకు మిగుల్చుతాడు వేటూరి. ఈ పాటకు జాతీయ అవార్డ్ అందుకున్నాడు. ఆ అవార్డ్ అందుకున్న రెండో సినీ సాహితీకారుడు వేటూరి.

వేటూరి పాటల్లో క్లాస్ ఉన్నాయి మాస్ ఉన్నాయి. పండిత పామరులను మెప్పించిన ఉన్నత సాహితీ విలువలున్న పాటలూ ఉన్నాయి. భాషమీద పట్టుతో పాటు స్వరజ్ఞానం ఆయనకున్న వరం. శబ్ధానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి సినిమా పాటను రక్తి కట్టించారు. అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి తెలుగు సినిమా పాటను లాలించి, పాలించి, శాసించిన సినీ కవితాగ్రేసరుడు వేటూరి.

వేటూరి రాసిన వాటిలో సాంఘికంగా ఎప్పటికీ తిరుగులేని పాట.. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో. ఈ పాటను ఎన్ని సార్లు విన్నా ఏదో తెలియని ఫీలింగ్ లోకి వెళ్లిపోతాం. ఈ పాటతో ఆడవారిని చులకనగా చూసేవారిపై అక్షర శస్త్రాలు సంధించారు. వారిపై జరుగుతున్న ఆకృత్యాలను పాటీకరించిన ఆయన కలంలోని ఆవేశానికి మనమూ గురవుతాం..

తొలినాళ్లలో ఆయన పాట మానసవీణపై మదుగీతమై ఎలా పరవశింప చేసిందో.. ఆఖర్లోనూ అంతే ఉత్సాహంగా పరవళ్లు తొక్కింది. ఉప్పొంగిన గోదారిని చూసి .. ఆనందంతో ఊగిపోయిన వరి చేలను ఊహించింది. డెభ్భైయేళ్ల వయసులో కూడా చెలికాడి నిర్లక్ష్యానికి గురయ్యానేమో అనుకుని ఓ యువతి పడే తాపత్రయాన్ని అందంగా లేనా.. అస్సలేం బాలేనా అని చెప్పగలిగారంటే.. సందర్భానికి తగ్గ పాటను కాదు ఇక్కడ చూడాల్సింది. దర్శకుడి ఊహకు ఆయన అద్దిన పదాల్ని, వాటిపై ఆయనకున్న సర్వాధికారాన్ని. ..

కెరీర్ ప్రారంభం నుంచీ.. తనదైన శైలిలో తెలుగు సినిమా పాటలో సాహితీ సేద్యం చేసి ఎన్నో అద్భుతమైన పాటలను పండించారు. ముఖ్యంగా ఇళయరాజా, వేటూరి కలయికలో వచ్చిన పాటలన్నీ ఆణిముత్యాలే. కవిగా ఎంత గొప్పవాడో తెలుగు భాషాభిమానిగానూ ఆయన అంతే గొప్పవాడు. అందుకే తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చిన నిజమైన మాతృభాషాభిమాని.. వేటూరి.. భౌతికంగా వేటూరి మనమధ్య లేకపోయినా.. తన అక్షరాలతో అనునిత్యం తెలుగు భాషతో మమేకమయ్యే ఉంటారు.

Tags

Read MoreRead Less
Next Story