సమత నిందితులకు ఉరిశిక్ష

సమత నిందితులకు ఉరిశిక్ష

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత కేసులో ఆదిలాబాద్‌ న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ.. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు తుది తీర్పు ప్రకటించింది. ఉదయం పదకొండు గంటల తరువాత నిందితులను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా.. నిందితులను కోర్టు హాలులోకి పిలిచిన జడ్జి.. వారి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేరం రుజువైందని నిందితులకు చెప్పారు. అయితే కుటుంబానికి తామే ఆధారమంటూ న్యాయమూర్తి ముందు నిందితులు కన్నీరు పెట్టుకున్నారు. నలుగురు పిల్లలురున్నారని, శిక్ష తగ్గించాలని జడ్జిని ప్రాధేయపడ్డారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి మీరు ఘోరమైన తప్పిదం చేశారని.. శిక్ష తప్పదని వారికి చెప్పినట్టు తెలుస్తోంది.

అంతకుముందు కోర్టు దగ్గర సైతం ఉద్రిక్త వాతావరణం కనిపించింది. తుది తీర్పు కోసం సమత భర్త గోపి, కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరయ్యారు. అలాగే సమతా స్వగ్రామం గోనంపల్లె వాసులు సైతం కోర్టుకు భారీగా చేరుకున్నారు. నిందితులకు ఉరి తీయాలని గట్టిగా నినాదాలు చేశారు. వారిని అదుపు చేసేందుకు కోర్టు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

కొమురంభీం జిల్లా లింగాపూర్‌ అటవీ ప్రాంతంలోని ఎల్లపటార్‌లో నవంబర్‌ 24న ముగ్గురు నిందితులు షేక్‌ బాబా, షేక్‌ షాబుద్దీన్, షేక్‌ మగ్దూమ్‌లు సమతను అత్యాచారం చేసి హత్య చేశారు. తరువాత కేసును ఆదిలాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానానికి అప్పగించారు. అప్పటి నుంచి దర్యాప్తు ముమ్మరమైంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ నెల 20నే వాదనలు పూర్తి అయ్యాయి. 27న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరచనుండగా న్యాయమూర్తి అనారోగ్య కారణంగా గురువారానికి వాయిదా పడింది. దీంతో జడ్జి ఎలాంటి తీర్పు ప్రకటిస్తారంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెజార్టీ ప్రజలు వారికి ఉరి శిక్ష పడాలనే ఆశించారు. అందరూ అనుకున్నట్టే జడ్డి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story