కరోనా వైరస్ పై వస్తున్న అసత్య ప్రచారాలతో భయపడొద్దు

కరోనా వైరస్ పై వస్తున్న అసత్య ప్రచారాలతో భయపడొద్దు

తెలంగాణలో కరోనా వైరస్ పై వస్తున్న అసత్య ప్రచారాలతో ప్రజలు భయపడొద్దని.. స్వైన్ ఫ్లూ సమయంలో తీసుకున్నట్లుగానే అన్ని విధాలుగా మందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఈటల సమావేశమయ్యారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కావాల్సిన ముందుస్తు చర్యలపై వారితో సమాలోచనలు జరిపారు. సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దని ఈటల విజ్ఞప్తి చేశారు.

కరోనా వైరస్ కేసులు నమోదైతే వైద్యం అందించేందుకు ఇప్పటికే గాంధీ, ఫీవర్, ఛెస్ట్‌ ఆస్పత్రుల్లో కలిపి సుమారు 100 పడకలను సిద్ధం చేసినట్టు చెప్పారు. కరోనా లక్షణాలతో ఉన్నవారి రక్త నమూనాలను తరచూ పుణె పంపడం ఇబ్బందికరంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోనే పరీక్షలు చేసేందుకు కావాల్సిన కిట్స్ ని సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. చైనాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్రంతో చర్చిస్తున్నామని తెలిపారు.

మరోవైపు.. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ వైద్యుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. మంగళవారం ఫీవర్ ఆస్పత్రిని సందర్శించిన వైద్యుల బృందం.. బుధవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించింది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా, స్వైన్ ఫ్లూ వార్డుల ల్యాబ్ ను బృందం పరిశీలించింది. కరోనా వైరస్ అనుమానితులకు అందిస్తున్న చికిత్సపై బృందంలోని వైద్యులు ఆరా తీశారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, చికిత్స విధానంపై వైద్యులకు పలు సూచనలు చేశారు. వైరస్ వ్యాప్తి చెందుతోందన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా వైద్యులకు బృందం సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story