మూడు రాజధానులపై జీఎన్‌ రావు సంచలన వ్యాఖ్యలు

మూడు రాజధానులపై జీఎన్‌ రావు సంచలన వ్యాఖ్యలు

రాజధానిగా విశాఖ సేఫ్ కాదు.. ఈ కోస్టల్‌ సిటీకి ప్రతికూలతలు ఉన్నాయంటూ GNరావు, బోస్టన్ కమిటీలు తమ నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నాయని.. అయితే ఈ కీలక అంశాలను బయటకరాకుండా తొక్కేశారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ మేరకు GNరావు కమిటీ ఇచ్చిన నివేదిక కూడా వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. విమర్శలు తీవ్రం కావడంతో స్వయంగా మీడియాముందుకు వచ్చి వివరణ ఇచ్చారు GNరావు కమిటీ ఛైర్మన్. దురదృష్టవశాత్తు కొందరు కావాలనే..తమ వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. విశాఖకు కొన్ని ప్రతికూలతలు ఉన్నమాట వాస్తవమేనని అంగీకరించారాయన. అందుకే సముద్ర తీరానికి దగ్గరగా కాకుండా 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో కీలక నిర్మాణాలు చేపట్టాలని నివేదికలో సూచించినట్లు చెప్పారు. తుఫాన్లు ఎక్కడైనా వస్తుంటాయని.. హైదరాబాద్‌లో మాత్రం రావా అని ప్రశ్నించారు. అన్ని అంశాలనూ పరిశీలించిన తర్వాతే విశాఖ బెస్ట్ ఆప్షన్‌ అనే అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు జీఎన్‌ రావు.

తమ కమిటీలో ఉన్న వారంతా 40 నుంచి 50 ఏళ్ల అనుభవం ఉన్నవారేనని చెప్పారు జీఎన్‌రావు. ఢిల్లీ, మద్రాస్, బెంగళూరు నుంచి వచ్చిన నిపుణులతో అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించామన్నారు. 3 నుంచి 4 నెలల పాటు అధ్యయం చేసిన తర్వాతే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో 4 ప్రాంతీయ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లు చెప్పారు జీఎన్‌రావు. ఈ కమిషనరేట్లకు పూర్తి అధికారాలు ఇవ్వాలని కూడా పేర్కొన్నామని తెలిపారు. విశాఖతో పాటు విజయవాడ, మచిలీపట్నం నగరాలకు సంబంధించిన లాభనష్టాలను కూడా చర్చించామన్నారు. కర్నూలులో హైకోర్టు పెడితే జిరాక్స్ సెంటర్లకే పరిమితం అవుతుందన్న వాదన తప్పన్నారు.

రిపోర్టు రూపొందించే సమయంలో ఇంటింటికి వెళ్లి రైతుల్ని కలవలేదని..అయితే చాలా మంది తమ దగ్గరికే వచ్చి వారి అభిప్రాయాలను చెప్పారని GN రావు తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story