రతన్ టాటా కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఇన్ఫోసిస్ అధినేత

జనరల్‌గా బడా పారిశ్రామికవేత్తల మధ్య ఈగో ఫీలింగ్స్ ఉంటాయి. బహిరంగంగా ప్రదర్శించనప్పటికీ లోలోపల మాత్రం ఇబ్బందిగా ఫీలవుతుంటారు. ఎదురు పడినప్పడు ఏదో మొహమాటంతో పలకరించుకుంటారు తప్పితే మన:స్ఫూర్తిగా మాట్లాడడం చాలా అరుదు. అలాంటి అరుదైన సందర్భం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఒక పారిశ్రామికవేత్తకు, మరో వరల్డ్ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ పాదనమస్కారం చేశారు. వయసు-అనుభవానికి మన:స్ఫూర్తిగా దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలు ఎంత పెద్దవో మనకు తెలుసు. టాటా అధినేత రతన్ టాటా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందారు. తాజాగా వారిద్దరి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందుకు బలమైన కారణం కూడా ఉంది. రతన్ టాటాకు నారాయణమూర్తి పాద నమస్కారం చేశారు. ఆ ఒక్క సీన్ నెటిజన్లను కట్టిపడేసింది. వరల్డ్ ఫేమస్ బిజినెస్‌మేన్ ఐనప్పటికీ ఎలాంటి బేషజాలకు పోకుండా తనకంటే పెద్దవారైన రతన్ టాటాకు నారాయణమూర్తి పాదనమస్కారం చేయడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ట్రైకాన్ ముంబై 2020 11వ వార్షిక అవార్డుల కార్యక్రమానికి రతన్ టాటా, నారాయణమూర్తి హాజరయ్యారు. ఇందులో భాగంగా రతన్ టాటాకు అవార్డు ప్రకటించారు. ఆ పురస్కారాన్ని నారాయణమూర్తి చేతుల మీదుగా ప్రదానం చేశారు. టాటాకు అవార్డు బహూకరించిన నారాయణమూర్తి, ఆ తర్వాత టాటా పాదాలకు నమస్కరించారు. ఒక్కక్షణం విస్మయం చెందిన టాటా, వెంటనే తేరుకొని నారాయణ మూర్తిని మన:స్ఫూర్తిగా ఆశీర్వదించారు.
రతన్ టాటా, నారాయణమూర్తిలు మంచి స్నేహితులు. అలాగే, వారిద్దరి మధ్య మర్యాదపూర్వక అనుబంధం ఉంది. గొప్ప స్నేహితుడైన నారాయణమూర్తి నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని రతన్ టాటా సంతోషం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com