టీఆర్ఎస్ విజయాన్ని అపహాస్యం చేస్తున్నారు : మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ విజయాన్ని అపహాస్యం చేస్తున్నారు : మంత్రి కేటీఆర్

2014 జూన్‌ నుంచి తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఎన్నికలో.. అద్భుతం జరుగుతోందన్నారు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన మేయర్లు, కౌన్సిలర్లు కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నాటుకున్నాయన్నారు. పంచాయతీ, జడ్పీ మండల పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్ చారిత్రక విజయం సాధించిందని తెలిపారు.

జడ్పీల్లో నూటికి నూరు శాతం సీట్లు సాధించడం దేశంలోనే ఓ చరిత్ర అన్న కేటీఆర్.. మున్సిపల్‌ ఎన్నికల్లో 130 సీట్లకు 122 సీట్లు సాధించడం మరో చరిత్ర అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కారు దూసుకుపోతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు అభ్యర్థులే కరువయ్యారని అన్నారు. టీఆర్ఎస్ విజయాన్ని అపహాస్యం చేస్తూ కొందరు మాట్లాడుతున్నారని.. ఇది ఓటేసిన ప్రజలను అవమానించడమేనని కేటీఆర్ తెలిపారు.

మున్సిపల్ , కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన నేతలంతా అభివృద్ధిపైనే దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. గెలిచామనే అహంకారం తలకు ఎక్కించుకోవద్దని.. ఈ విషయంలో సీఎం కేసీఆర్ గతంలో చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. త్వరలో మున్సిపల్ చట్టంపై కొత్తగా ఎన్నికైనవారికి శిక్షణ ఇస్తామని తెలిపారు. అవినీతికి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు దూరంగా ఉండాలి.. తప్పులు చేసి తలవంపులు తేవొద్దన్నారు. తప్పులు చేస్తే పదవులు ఊడుతాయి. ఈ విషయంలో కేసీఆర్ కఠినంగా ఉన్నారు. తప్పు చేసిన వారిని కాపాడాలని ఎవరు చెప్పినా విననని కేటీఆర్ హెచ్చరించారు.

సామాజిక న్యాయాన్ని టీఆర్‌ఎస్‌ పాటించి చూపించిందన్నారు కేటీఆర్. 57 శాతం మహిళలకు మున్సిపల్ పీఠాల్లో అవకాశమిచ్చామని.. ఏడు శాతం ఎక్కువే ఇచ్చినట్లు ఆయన వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story