యడ్ల గోపాలరావుకు పద్మశ్రీ లభించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న శ్రీకాకుళం జిల్లా వాసులు

ప్రముఖ రంగస్థల కళాకారుడు యడ్ల గోపాలరావును పద్మశ్రీ పురస్కారం వరించడంతో.. శ్రీకాకుళం జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. సుదీర్ఘ కాలంగా నాటక రంగంలో ఆయన అందిస్తున్న సేవలకుగానూ ఇటీవల ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. రంగస్థలంపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో యడ్ల గోపాలరావు మెప్పించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన నటనతో కళాభిమానులను ఉత్సాహపరిచారు. యడ్ల గోపాల్ రావుకు పద్మశ్రీ పురస్కారం లభించడం పట్ల.. జిల్లా వ్యాప్తంగా నాటకరంగ అభిమానులు, రంగస్థల కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
యడ్ల గోపాలరావు రంగస్థల కళాకారుడిగా అంతర్జాతీయ గుర్తింపును సాధించారు. అన్నిరకాల పాత్రల్లో ఒదిగిపోయారు. పారాణిక పద్యనాటకాలైన శ్రీరామాంజనేయ యుద్ధంలో శ్రీరాముడిగాను, కురుక్షేత్రం, గయోపాఖ్యానంలో శ్రీకృష్ణుడిగాను, శ్రీకృష్ణతులాభారం, నారదగర్వభంగం నాటకాల్లో నారదుడిగా, హరిశ్చంద్రలో నక్షత్రకుడిగా తన నటనా కౌశల్యంతో కళాభిమానులను అలరించారు. ఇప్పటివరకూ 5,600 ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా హరిశ్చంద్ర పౌరాణిక నాటకంలో నక్షత్రకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com