బడ్జెట్‌ 2020 : సామాన్యుడికి ఊరట దక్కుతుందా? సగటు వేతన జీవిని కరుణిస్తారా?

బడ్జెట్‌ 2020 : సామాన్యుడికి ఊరట దక్కుతుందా? సగటు వేతన జీవిని కరుణిస్తారా?

సామాన్యుడికి ఊరట దక్కుతుందా? సగటు వేతన జీవిని కరుణిస్తారా? రైతులకు ఏం వరాలు ఉండబోతున్నాయి? కార్పోరేట్‌ సెక్టార్‌కు ఉద్దీపనలు ప్రకటిస్తారా? బడ్జెట్‌ 2020 ఎలా ఉండబోతోంది? ఇవాళ పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పైనే అందరి చూపు. ఆర్థిక మాంద్యానికి బడ్జెట్‌ ఇచ్చే మందు ఎలా ఉండబోతోంది అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఆర్థిక మందగమనం, అరకొర ఆదాయంతో సతమతం అవుతున్న ప్రజలు ఈసారి బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. తమ సమస్యలన్నింటికీ ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని ఆకాంక్షిస్తున్నారు. కానీ సవాళ్ల సంద్రాన్ని ఈదుతున్న మోదీ సర్కారుకు.. అందరి కోర్కెలు తీర్చడం కత్తి మీద సాముగా కనిపిస్తోంది. ఆర్థిక మందగనం కారణంగా పన్ను వసూళ్ల ఆదాయం భారీగా పడిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది. ప్రజల ఆశలు తీర్చేలా బడ్జెట్‌ ఉంటుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఉద్దేశంతో గత సెప్టెంబర్‌లో నిర్మలాసీతారామన్ కార్పోరేట్‌ పన్నును బాగా తగ్గించారు. ఈ ఒక్క నిర్ణయంతోనే ఖజానాపై 1.45 లక్షల కోట్ల మేర ప్రభావం చూపుతోంది. మరోవైపు 2019లో చాలా వస్తు, సేవలపై జీఎస్టీని ప్రభుత్వం తగ్గించింది. స్థిరాస్థి, ఎలక్ట్రిక్‌ వాహనాలు, హాస్టల్‌ వసతి, వజ్రాల తయారీ, ఔట్‌ డోర్‌ కేటరింగ్‌లాంటివి ఇందులో ఉన్నాయి. జీఎస్టీ కార్పోరేట్‌ పన్నుల తగ్గింపు, ఆర్థిక మందగమనం నేపథ్యంలో పన్నుల వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ కారణంగా ఈ సారి రాయితీలు, మినహాయింపులు, సబ్సిడీలివ్వడం సాధ్యం కాకపోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్‌లో వివిధ రంగాలు ఆశించిన ప్రోత్సాహకాలు ఉండకపోవచ్చని అంటున్నారు.

అయితే సగటు వేతన జీవి మాత్రం ఈ బడ్జెట్‌పై కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాడు. తమకు ఈ బడ్జెట్‌లోనైనా మేలు జరుగుతుందని ధీమాతో ఉన్నాడు. కార్పోరేట్లకు పన్ను, స్టార్టప్‌ సంస్థలకు ఏంజెల్ టాక్స్‌, వ్యాపారులకు జీఎస్టీ, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లపై విధించిన సర్‌ఛార్జీ మళ్లీ ఉపసంహరించుకోవడం.. ఇలా అందరికి ప్రోత్సాహకాలు అందించినప్పుడు తమకు కూడా పన్ను తగ్గిస్తే బాగుంటుందని వేతన జీవులు కోరుకుంటున్నారు. గత బడ్జెట్‌లో ఏడాదికి 5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి పన్ను చెల్లించనక్కర్లేదనే ప్రతిపాదన చేశారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ ఏడాది 40 వేల నుంచి 50 వేలకు పెంచారు. ఈ బడ్జెట్‌లోనూ ఏదో కొంత ప్రయోజనకం చేకూర్చేలా కేంద్రం ప్రకటన చేస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తగ్గించిన పన్నులతో ఆదాయంపై పడుతున్న భారాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం వేతన జీవులకు పన్నులు తగ్గించుకపోవచ్చేనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

బడ్జెట్‌ 2020పై వివిధ రంగాల్లో ఆశలు-అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా గతేడాది కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గించడంతో.. వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులకూ ఊరట కల్పించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచడంతోపాటు సెక్షన్‌ 80సీ పరిమితినీ పెంచాలని కోరుతున్నారు. అటు దీర్ఘకాలం పెట్టుబడిపై లాభాల పన్ను , డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ను ఎత్తివేయడం లేదా తగ్గించాలని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రైవేట్‌ రంగ పెట్టుబడులు పెంచేలా చర్యలు చేపట్టాలని కార్పొరేట్‌ రంగం ఆశిస్తోంది. ముఖ్యంగా మౌలిక ప్రాజెక్టుల కోసం పెట్టుబడుల సేకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుకుంటోంది. మరోవైపు స్థిరాస్తి కొనుగోళ్లకు ఊతమిచ్చేలా గృహ రుణ వడ్డీ చెల్లింపులపై వార్షిక పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని కోరుతున్నారు.

మిగతా సెక్టార్లకు పెద్దగా ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం లేకున్నా... వ్యవసాయానికి బడ్జెట్‌లో పెద్ద పీట వేసే ఛాన్స్‌ కనిపిస్తోంది. బడ్జెట్‌లో రైతుల కోసం రెండు కీలక పథకాలు ఆవిష్కరించే అవకాశం ఉంది. గత బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఎఫ్‌పీవో ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామని తెలిపారు. అది ఈ బడ్జెట్‌లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌పీవో కార్యక్రమానికి 7,000 కోట్లు కేటాయించే అవకాశముందని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story