అమరావతి గ్రామాల్లో 24 గంటల నిరాహార దీక్షలు

అమరావతి గ్రామాల్లో 24 గంటల నిరాహార దీక్షలు

అమరావతి రైతుల ఆందోళనలు ఇంకాస్త ఉగ్రరూపం దాలుస్తున్నాయి. 47వ రోజు రాజధాని గ్రామాల్లో నిరసలు తీవ్రమవుతున్నాయి. సేవ్ అమరావతి.. మూడు రాజధానులు వద్దు అంటూ రైతులు, మహిళలు నినదిస్తున్నారు. హైకోర్డు ఆదేశాలను కూడా కాదని అర్థరాత్రి కార్యాలయాల తరలింపు ఉత్తర్వులు ఇవ్వడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసగా ఇవాళ మందడం.. తుళ్లూరుల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. వెలగపూడి తదితర గ్రామాల్లో 24 గంటల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి..

తాడికొండ అడ్డరోడ్డు, కృష్ణాయపాలెం, వెలగపూడి, రాయపూడి, యర్రబాలెం, కృష్ణాయపాలెం, నిడమర్రు తదితర ప్రాంతాల్లో రిలే దీక్షలతో పాటు.. 24 గంటల దీక్షలకు రైతులు సిద్ధమయ్యారు. వరుసగా నాలుగో రోజు రైతులు, మహిళలు సత్యాగ్రహ దీక్షలు చేపడుతున్నారు. ముస్లిం మహిళల ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాజధాని రైతులకు సంఘీభావంగా ఇవాళ బీజేపీ, జనసేన నాయకులు పర్యటించనున్నారు. జనసేన నుంచి నేరుగా పవన్ రంగంలోకి దిగి రాజధాని రైతులతో మాట్లాడి వారికి మద్దతుగా కాసేపు దీక్షలో కూర్చునున్నారు.. ఇటు బీజేపీ నుంచి మాజీ మంత్రి రావెల కిషోర్‌తో పాటు ఇతర నేతలు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు..

అర్థరాత్రి కార్యాలయాల తరలింపుపై ఉత్తర్వులు ఇవ్వడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం పట్టించుకోదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు న్యాయవాదులు, విజయవాడకు చెందిన పలువురు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని కోల్పోయేది లేదని, అహింసాయుతంగా పోరాడి అమరావతిని సాధించుకుంటామని స్పష్టం చేస్తున్నారు..

47 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడంతో కొందరి రైతుల గుండెలు అలసి పోతున్నాయి. తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ 50 ఏళ్ల గడ్డం రమేష్ మనోవ్యథతో మరణించారు. మరోవైపు నాగార్జునా యూనివర్శిటీలోని నలుగురు విద్యార్థులు జై అమరావతి అని నినదించడంతో వారిని సస్పెండ్‌ చేశారు. వెంటనే హాస్టల్‌ కాళీ చేసి వెళ్లాలని వర్శిటీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story