బడ్జెట్‌లో ఏపీ ఆర్థిక శాఖ వేసిన అంచనాలు ఘోరంగా విఫలం

బడ్జెట్‌లో ఏపీ ఆర్థిక శాఖ వేసిన అంచనాలు ఘోరంగా విఫలం

రాష్ట్ర విభజన తరువాత ఏపీ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతింది. గాయానికి మందు వేయాల్సిన ప్రభుత్వం.. దాన్ని ఇంకాస్త తీవ్రతరం చేస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌ పూర్తిగా బోర్లాపడింది. బడ్జెట్‌లో ఏపీ ఆర్థిక శాఖ వేసిన అంచనాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ మాటలు అంటున్నది విపక్ష నేతలో.. రాజకీయ విశ్లేషకులో కాదు.. స్వయంగా కాగ్‌ వెబ్‌ సైట్‌లో పేర్కొన్న గణాంకాలే అలా ఉన్నాయి..

12 నెలలకు గానూ అప్పులు మినహాయిస్తే 1.78 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ఆర్థికశాఖ అంచనా వేసింది. అప్పులతో కలుపుకుంటే ఆదాయం 2 లక్షల14 వేల 558 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంచనాలకు తగ్గట్టు భారీగా ఖర్చులు చూపించారు. వాస్తవానికి వచ్చేసరికి ఈ అంచనాలన్నీ పూర్తిగా తలకిందులయ్యాయి. మొదటి 9 నెలల్లో అంటే గత డిసెంబర్‌ వరకు వచ్చింది కేవలం 72 వేల 322.49 కోట్ల రూపాయలు మాత్రమే. జనవరి, ఫిబ్రవరి మార్చి ఈ 3 నెలల్లో 1.06 లక్షల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంది.

కాగ్‌ వెబ్‌సైట్‌ గణంకాలు చూస్తే.. ఈ 12 నెలల కాలంలో 35 వేల 860 కోట్ల అప్పులు తెచ్చుకుంటామని అంచనాలు బడ్జెట్లో పెట్టినట్టు కనిపిస్తోంది. కానీ 9 నెలల్లోనే 40 వేల 410 కోట్లు అప్పులు తెచ్చారు. మరో 7 వేల 428 కోట్లు అప్పులు తెచ్చేందుకు జనవరిలో కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. ఇప్పటికే 4 వేల కోట్ల రూపాయలకు పైగా తెచ్చి వాడినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇన్ని అప్పులు తెచ్చినప్పటికీ జనవరిలో ఓవర్‌డ్రాఫ్ట్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఈ తొమ్మిది నెలల్లో తెచ్చిన అప్పులతో కలుపుకుంటే ఆదాయం లక్ష12 వేల 778 కోట్ల రూపాయలకు చేరింది. ఈ లెక్కన చూస్తే తొమ్మిది నెలల కాలంలో వచ్చింది బడ్జెట్‌ అంచనాల్లో సగం మాత్రమే.

ప్రస్తుతం ఆదాయ మార్గాలు ఆశాజనకంగా లేవు. కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ పరిహారాలు సమయానికి రావడం లేదు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా గణనీయంగా తగ్గింది. 12 నెలలకు గానూ 36 వేల 485 కోట్ల రూపాయలు అంచనా వేస్తే 9 నెలల్లో వచ్చింది కేవలం 19 వేల 133 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక్కడే 17 వేల 352 కోట్ల రూపాయల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గ్రాంట్ల రూపంలో 61 వేల 071 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తే 9 నెలల్లో వచ్చింది 12 వేల 987 కోట్లు మాత్రమే. ఈ లెక్కన చూస్తే అప్పులు తప్ప.. ఆదాయ మార్గాలకు వేసిన అంచనాలన్నీ పూర్తిగా గాడి తప్పినట్టే కనిపిస్తోంది...

కాగ్‌ వెబ్‌సైట్‌లో ఉన్న లెక్కలు చూస్తుంటే ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది. అయితే ఏపీ ఆర్థిక పరిస్థితి చితికిపోడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పూర్తిగా పెట్టుబడులు నిలిచిపోయాయి.. వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు చాలా వరకు వెనక్కు వెళ్లిపోయాయి. అంతర్జాతీయ కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి వెనక్కు వెళ్లిపోతున్నట్టు ప్రకటించాయి. భవిష్యత్తులో పెట్టుబడులు వచ్చేందుకు ప్రభుత్వం భరోసా కల్పించడం లేదు. రాజధాని తరలింపు అంశం కూడా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపింది. రాజధానిపై స్పష్టత లేకపోవడం.. ఇప్పటి వరకు అక్కడ పెట్టిన ఖర్చంతా వృథా కావడం.. రూపాయి ఆదాయం కూడా రాకపోవడంతో ఖర్చులు పెరిగాయి. పోలవరాన్ని పక్కన పెట్టేయడం కూడా ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తోంది. అమరావతిలో పనులు ముందుకు సాగడం లేదు.. పోలవరం నిర్మాణం ఆగిపోయింది. దీంతో కేంద్రం కూడా అనుకున్న స్థాయిలో నిధులు ఇవ్వడం లేదు. వీటికి తోడు రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుకే మార్గాలు ఏవీ ప్రభుత్వం చూపించడం లేదు. ముఖ్యంగా ఎక్సైజ్‌ ద్వారా భారీ ఆదాయం రావాల్సి ఉన్నా.. ప్రభుత్వం మద్యపానం నిషేదం దిశగా అడుగులు వేస్తుండడంతో ఆదాయానికి గండిపడుతోంది. మరోవైపు ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ పేరుతో చాలా వరకు ఇసుక రవాణాను నిలిపివేసింది. దీంతో ఎక్కడిక్కడ నిర్మాణాలు నిలిచిపోయాయి.. రాబడి అగిపోయింది.. రావాల్సిన పన్నులు తగ్గిపోయాయి. ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. అసలే రాబడి ఆదాయం లేదు.. ఇలాంటి సమయంలో పొదుపుగా ఖర్చులు చేయాల్సిన ప్రభుత్వం.. సంక్షేమ పథకాల పేరుతో భారీగా ఖర్చులు చేస్తోంది. బయట నుంచి అప్పులు తెచ్చి పరిస్థితిని చక్కపెడదాం అన్నా.. ఇటు ఆర్‌బీఐ.. అటు అంతర్జాతీయ బ్యాంకులు ఏపీకి అప్పులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలే ఆర్థిక పరస్థితి గాడి తప్పడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు, విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు కాగ్‌ వెబ్‌సైట్‌లో లెక్కలు సైతం ఇదే భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థికంగా రాష్ట్రం సతమతమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story