పాలనా వికేంద్రీకరణలో ఏపీ ప్రభుత్వం తొలి అడుగు

పాలనా వికేంద్రీకరణలో ఏపీ ప్రభుత్వం తొలి అడుగు

పాలనా వికేంద్రీకరణలో ఏపీ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. కార్యాలయాల తరలింపును అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌ సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ విభాగాలన్ని వెలగపూడి సచివాలయంలో ఉన్నాయి. తాజాగా వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఈ కార్యాలయాలకు అవసరమైన బిల్డింగ్‌లను ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు, కర్నూలు కలెక్టర్‌కు జగన్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఈ కార్యాలయాలు కర్నూలు కేంద్రంగా విధులు నిర్వర్తించేలా చూడాలని నిర్ణయం తీసుకుంది.

శ్రీబాగ్‌ ఒప్పందం, జీఎన్‌రావు, బోస్టన్‌ గ్రూప్‌ సూచనల మేరకు న్యాయ సంబంధిత కార్యాలయాలన్నింటిని కర్నూలులో పెడతామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పాలనా వికేంద్రీకరణలో భాగంగా తొలి అడుగు వేస్తూ.. విజిలెన్స్‌ కమిషన్‌, కమిషనరేట్ ఆఫ్‌ ఎంక్వైరీస్ ఛైర్మన్‌ సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలించేందుకు చర్యలు చేపట్టింది.

మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ వైపు అమరావతి రైతులు 47రోజులుగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాలనా వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలి సెలెక్ట్‌ కమిటీ పంపింది. అలాగే హైకోర్టు అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తరలించరాదని గతంలో న్యాయస్థానం హెచ్చరించింది. ఐనా ప్రభుత్వం వీటన్నింటిని ఏమాత్రం పట్టించుకోలేదు. పాలనా వికేంద్రీకరణకే మొగ్గు చూపుతూ కార్యాలయాల తరలింపు పనులను మొదలుపెట్టింది. ఐతే ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆందోళనలను పట్టించుకోకుండా అర్ధరాత్రి ఉత్తర్వులు ఇవ్వడంపై మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story