పాత థర్మల్ విద్యుత్ కేంద్రాలకు హెచ్చరిక..!

రవాణా, మౌలికరంగాల అభివృద్ధికి బడ్జెట్‌లో కొత్త వ్యూహాలు ప్రకటించారు. రవాణా, మౌలిక సదూపాయాలకు లక్ష 70 వేల కోట్లు కేటాయించారు. ఐతే, ఇక్కడ కూడా ప్రైవేటుకే పెద్ద పీట వేశారు. పీపీపీ పద్ధతికే కేంద్రం మొగ్గుచూపింది. లేదు లేదంటూనే రైల్వేల్లోనూ ప్రైవేటుకు బాటలు పరుస్తోంది. కొత్తగా 150 రైళ్లు ప్రవేశపెడతామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో తయారు చేసేవే. 2023 నాటి ఢిల్లీ-ముంబై మధ్య ఎక్స్‌ప్రెస్ హైవేను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైలును పరుగులు పెట్టిస్తామని ప్రకటించింది. తేజస్ తరహా రైళ్లు, సెమీ హై స్పీడ్ ట్రైన్లను పెద్ద సంఖ్యలో ప్రవేశపెడతామని తెలిపింది. బెంగళూరుకు 18 వేల 600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్ రైల్వే పథకం ప్రకటించిన కేంద్రం, 11వేల కిలోమీటర్ల మేర రైల్వేమార్గాల విద్యుదీకరిస్తామని పేర్కొంది. రైల్వే ట్రాక్‌ల వెంబడి భారీ సోలార్ విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తామని తెలిపింది.
విమానయాన రంగం గురించి బడ్జెట్‌లో పెద్దగా ప్రకటనలు లేవు. 2024 నాటికి దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు నిర్మిస్తామని ప్రకటించారు. ఇది తప్ప ఊరడింపులు, ఊరటలు ఏమీ లేవు. ఎయిర్ ఇండియాను అమ్మేయాలని గతంలోనే నిర్ణయించినందున ఆ సంస్థకు ఎలాంటి ఉద్దీపనలు ప్రకటించలేదు. ఓడరేవుల అభివృద్ధిపై కేంద్రం దృష్టిసారించింది. నౌకాశ్రయాలను అనుసంధానించేలా రహదారులను అభివృద్ధి చేస్తామని తెలిపింది. నదీతీరాల వెంబడి అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది.
పర్యాటకం-సాంస్కృతిక రంగాలకు కేంద్రం కొద్దిగా ప్రాధాన్యత ఇచ్చింది. టూరిజం ప్రోత్సాహానికి 2,500 కోట్లు కేటాయించింది. సాంస్కృతిక శాఖకు 3, 150 కోట్లు ప్రకటించింది. టూరిజం డెవలప్‌మెం ట్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 5 పురాతన కేంద్రాలను ఆధునీకరించాలని నిర్ణయించారు. హర్యానాలోని రాఖీగడ, యూపీలో హస్తినాపూర్, అసోంలోని శివసాగర్, గుజరాత్‌లోని ధోలావీర, తమిళనాడు లోని ఆదిత్య నల్లూరు ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు. జార్ఖండ్ రాజధాని రాంఛీలో ట్రైబల్ మ్యూజియం, గుజరాత్‌లోని లోథాల్‌లో మారిటైం మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. వారసత్వ పరిరక్షణకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్‌ను నెలకొల్పనున్నారు.
పరిశుభ్రత, స్వచ్చతకు కేంద్రం అధిక ప్రాధాన్యమిచ్చింది. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. పారిస్ ఒప్పందాన్ని పాటిస్తామని, కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. అందుకు కార్యాచరణ కూడా ప్రకటించింది. 10 లక్షల జనాభా దాటిన నగరాల్లో స్వచ్ఛమైన గాలి లభించడం కష్టంగా మారిందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ దుస్థి తిని పోగొట్టి నగరాల్లో స్వచ్చమైన గాలి అందించేలా చేయడానికి 4, 400 కోట్లు కేటాయించింది. అలాగే, పాత థర్మల్ విద్యుత్ కేంద్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలని సూచించింది. లేకపోతే మూసివేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com