దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదు.. పునాదులు బలంగా ఉన్నాయి : నిర్మలా సీతారామన్

దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదు.. పునాదులు బలంగా ఉన్నాయి : నిర్మలా సీతారామన్

ఆర్థికమందగమనం, క్షీణిస్తున్న వృద్ధి రేటు, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న వేళ మోదీ సర్కారు రెండో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కీలక రంగాలన్నీ ఎన్నో ఆశలు పెట్టుకున్న సమ యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, వరుసగా రెండోసారి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదని, దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. జీఎస్టీ వ్యవస్థను ప్రభుత్వం సమర్దించుకుంది. జీఎస్టీతో సామాన్య ప్రజలకు నెలకు 4 శాతం ఆదా అవుతోందని చెప్పుకొచ్చింది. 40 కోట్ల జీఎస్టీ రిట ర్న్‌లు దాఖలయ్యాయని వివరించింది. ద్రవ్యలోటు కట్టడిలో విజయ వంతం అవుతున్నామని తెలిపిన కేంద్రం, 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఫిసికల్ ఢెపిసిట్‌ 3.8 శాతంగా ఉంటుందని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటును 3.5 శాతానికి తగ్గి స్తామని ప్రకటించింది.

సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదని ప్రభుత్వం మరోసారి అంగీకరించింది. ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ ద్వారానే లబ్దిదారులకు పూర్తి ప్రయోజనం కలుగుతుందని అభిప్రా యపడింది. 2014-19 మధ్య 7.4 శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపిన ప్రభుత్వం, 10 శాతం వృద్ది రేటు సాధించే సత్తా దేశానికి ఉందని స్పష్టం చేసింది. 2014-19 మధ్య 284 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని తెలిపిన ప్రభుత్వం, 2006-16 మధ్య దాదాపు 271 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ రుణం 2019 మార్చ్ నాటికి 48.7 శాతానికి తగ్గిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఆర్థిక వ్యవస్థ బలోపేతం, సమగ్ర అభివృద్ధికి నిర్మలా సీతారామన్ మూడు సూత్రాలను ప్రకటించారు. ఆస్పిరేషన్, ఎకనామిక్, కేరింగ్‌తో సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఇక, కేంద్ర బడ్జెట్‌లో వ్యవ సాయం-ఆరోగ్య రంగాలకు పెద్ద పీట వేశారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన కేంద్రం, వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చడానికి 16 పాయిం ట్లతో యాక్షన్ ప్లాన్ ప్రకటించింది. విద్యారంగానికి కూడా అధిక ప్రాధాన్యమిచ్చారు. విద్యారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రెండో బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ కొన్ని కొత్త ప్రణాళికలను ప్రకటించారు. నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ,ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ సెల్, నేషనల్ టెక్నాలజీ టెక్స్‌ టైల్ మిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలో నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ప్రకటించనున్నారు. స్మార్ట్ సిటీ ఆలోచన మరోసారి తెరపైకి వచ్చింది. ఐదు కొత్త స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. జీవిత బీమా సంస్థ, బ్యాంకుల్లోనూ ప్రైవేటుకు ద్వారాలు తెరిచింది. ఎల్‌ఐసీలో ప్రభుత్వ వాటాలను పాక్షికంగా విక్ర యించాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఎల్‌ఐసీని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేస్తామని ప్రతిపాదించింది. ఐడీబీఐ బ్యాంకులో మిగిలిన ప్రభుత్వ వాటాలను త్వరలోనే విక్రయిస్తామని నిర్మలా సీతారామ న్ తెలిపారు.

ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం నిపండానికి ప్రభుత్వం చర్యలు ప్రకటించింది. మౌలికరంగం అభివృద్ధిపై మరోసారి ఫోకస్ చేసింది. వచ్చే ఐదేళ్లలో వంద లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించింది. కొత్త హైవేలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణంతో మౌలిక రంగం ఊపందుకుంటుందని, తద్వారా ఉద్యోగ-ఉపాధి అవకాశాలు విస్తారిస్తాయని పేర్కొంది. మూలధనం పెంచడం ద్వారా బ్యాంకుల కష్టాలు తీరతాయని అభిప్రాయపడింది.

జమ్మూకశ్మీర్, లఢాఖ్‌ అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంది. జమ్మూకశ్మీర్‌కు 30, 757 కోట్లు, లఢాఖ్‌కు 5, 958 కోట్లు ప్రకటించింది. ఐతే, ఆటోమొబైల్, టెలికం, రియల్ ఎస్టేట్‌ రంగాలను పెద్దగా పట్టించుకోలేదు. అమ్మకాలు లేకపో వడం, జీఎస్టీ భారంతో ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలు విలవిలలాడుతున్నాయి. జీఎస్టీని తగ్గించాలని డిమాండ్‌ నెరవేరకపోవడంతో బడ్జెట్‌లోనైనా ఉపశమన చర్యలు ప్రకటిస్తారని ఆశలు పెట్టుకున్నారు. గ్రామీణ డిమాండ్‌ పుంజుకునేల చర్యలు తీసుకుంటారని, గృహ నిర్మాణం రంగం కోలుకోవడానికి కార్యాచరణ ప్రకటిస్తారని ఆశించారు. ఐతే, బడ్జెట్‌లో అలాంటి ప్రతిపాదనలు రాలేదు. టెలికం రంగానికి కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు. భారత్ నెట్ పథకానికి 6 వేల కోట్లు కేటాయించడం ఒక్కటే చెప్పుకోదగిన అంశం. మొత్తమ్మీద కొన్ని కొత్త పథకాలు, మరికొన్ని కొత్త ఆలోచనలు ప్రకటించిన కేంద్రం, ఆదాయ వృద్ధి ఎలా సాధ్యమవుతుందో మాత్రం చెప్పలేదు. నిరుద్యోగ సమస్యను మాటమాత్రంగా కూడా ప్రస్తావించలేదు.

Tags

Read MoreRead Less
Next Story