చైనాలో మరో భయంకర వైరస్ వెలుగులోకి

చైనాలో మరో భయంకర వైరస్ వెలుగులోకి

కరోనా కల్లోలం రోజురోజుకీ తీవ్రమవుతోంది.చైనాలో కాకుండా దాదాపు 25 దేశాల్లో కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఫిలిప్పీన్స్‌లో కూడా ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకు ఒక్క చైనాలోనే మృతుల సంఖ్య 300 దాటింది. దీంతో చాలా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. వుహాన్‌కు ప్రత్యేక విమానాలు పంపించి తమ దేశాలకు చెందిన పౌరులను వెనక్కి రప్పించుకుంటున్నాయి. అటు చైనా నుంచి ఇండియా వచ్చే ప్రయాణికుల విషయంలో భారత రాయబార కార్యాలయం కాస్త కఠినంగానే వ్యవహరిస్తోంది..తాత్కాలికంగా ఆన్ లైన్ వీసాలను రద్దు చేసింది. చైనా పాస్ పోర్టులు కలిగి ఉన్నవారితో పాటు చైనాలో నివసిస్తున్న విదేశీయులకూ ఇది వర్తిస్తుందని తెలిపింది.

కేరళలో రెండో కరోనా కేసు నమోదైంది. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తి ఇటీవల చైనాలో పర్యటించినట్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం కేరళలోనే తొలి కరోనా కేసు నమోదైంది.

ఇప్పటికే కరోనాతో విలవిలలాడిపోతున్న చైనాలో మరో భయంకర వైరస్ వెలుగుచూసింది. తాజాగా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లను కూడా గుర్తించినట్లు ఆ దేశ మంత్రి వెల్లడించారు. హునన్ ప్రావిన్సులో బర్డ్ ఫ్లూకు కారణమయ్యే H5N1 వైరస్ గుర్తించినట్లు తెలిపారు. ఈ వైరస్ ధాటికి ఇప్పటికే వేల సంఖ్యలో కోళ్లు మరణించాయి. ఫ్లూ వ్యాప్తి చెందకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు మనుషులెవరూ ప్రభావితం

కాలేదు..

కరోనా వైరస్ కారణంగా చైనాపై అంతర్జాతీయంగా విద్వేషం పెరుగుతోంది. పలు దేశాల్లో చైనీయులకు వ్యతిరేకంగా వివక్ష జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఆ దేశస్థుల పర్యటనలు నిషేధించడం, వారిని రెస్టరెంట్లలోకి రానివ్వకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. చైనీయులు మాత్రమే కాకుండా పలు ఆసియా ప్రాంతాలకు చెందిన వారిపైనా ఈ ప్రభావం పడుతోంది. ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్, హాంగ్ కాంగ్, వియత్నాంలోని రెస్టరెంట్లు చైనీస్ కస్టమర్లను నిరాకరిస్తున్నారు. మరోవైపు ఐరోపా, యూఎస్ లోనూ చైనా సహా ఇతర ఆసియా దేశాల వారు కరోనా కారణంగా వివక్షను ఎదుర్కొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story