శంషాబాద్ పై రియల్ ఎస్టేట్ రాబందుల పంజా..

శంషాబాద్ పై రియల్ ఎస్టేట్ రాబందుల పంజా..

హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో.. రియల్ ఎస్టేట్ రాబందులు యదేచ్ఛగా వాలిపోతున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో.. కాదేదీ కబ్జాకు అనర్హం అన్న చందంగా.. ప్రభుత్వ భూములను గుటకాయ స్వాహా చేస్తున్నాయి. శంషాబాద్ లోని కాముని చెరువు ను కబ్జా చేసిన కొందరు రియల్ వ్యాపారులు.. ఏకంగా ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. రంగంలోకి దిగిన అధికారులు రియల్ మాఫియా ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కబ్జా రాయుళ్ళ పై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న శంషాబాద్‌ రియల్ వ్యాపారులకు స్వర్గధామంలా మారింది. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో శంషాబాద్ పరిసర ప్రాంతాలలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో రియల్ మాఫియా బరితెగిస్తున్నారు. చెరువులు, కుంటలను కూడా కబ్జా చేసేందుకు ఈ ముఠా వెనుకాడడం లేదు. తాజాగా శంషాబాద్‌లో ఎయిర్ పోర్ట్ ప్రధాన మార్గాన్ని ఆనుకుని ఉన్న కాముని చెరువు పై రియల్‌ ఎస్టేట్‌ రాబందులు వాలిపోయాయి. కామును చెరువును అమాంతం మింగేందుకు రెడీ అయ్యారు కబ్జా రాయుళ్లు.

52 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కాముని చెరువు కు.. 92 ఎకరాల మేర FTL పరిధి ఉంది. నిబంధనల ప్రకారం FTL పరిధిలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు. కానీ, కాముని చెరువు సమీపంలో వెంచర్లు చేసిన కొందరు రియల్ వ్యాపారులు.. ఏకంగా చెరువు శికంతో పాటు FTL హద్దులు దాటి మరీ ప్లాట్లు చేశారు. రాత్రికి రాత్రి ట్రక్కుల ద్వారా మట్టిని తెచ్చి కాముని చెరువును పూడ్చివేస్తూ దర్జాగా ప్లాట్లు చేశారు. గజం భూమి రూ.20 వేల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ విషయం తెలియని అమాయకులు రియల్ మాఫియా ఉచ్చులో చిక్కుకుని మోసపోతున్నారు. డబ్బుకు వెనకాడకుండా కాముని చెరువు లో సైతం ప్లాట్ల ను కొనుగోలు చేసి నిర్మాణాలు చేస్తున్నారు. అయితే ఆలస్యంగా మేల్కొన్న ఇరిగేషన్ శాఖ అధికారులు కాముని చెరువును కబ్జా చేసిన రియల్ వ్యాపారుల పై RGIA పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కబ్జా రాయుళ్ళపై చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు కాముని చెరువును కబ్జా చేసిన రియల్ వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఎయిర్ పోర్ట్ పీఎస్ సీఐ విజయ్ కుమార్ చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story