టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు

టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు

మళ్లీ అదే ఫలితం. టీమ్‌ ఇండియా దూకుడు ముందు .. న్యూజిలాండ్ తేలిపోయింది. ఎప్పటి మాదిరిగానే ఒత్తిడికి చిత్తైపోయింది. విజయానికి దగ్గరగా వచ్చి చేతులెత్తేసింది. ఇప్పటికే 4 టీ-20ల్లో గెలిచి తన ఆధిపత్యాన్ని చాటిన కోహ్లీసేన ... ఆఖరి మ్యాచ్‌లోనూ ఏడు పరుగుల తేడాతో గెలిచి జైత్రయాత్రను కంటిన్యూ చేసింది. ఫలితంగా న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.

ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 60 , కేఎల్ రాహుల్ 45 పరుగులు చేశారు...ఒక దశలో భారత్ స్కోరు 200 దాటుతుందని అనిపించింది. కానీ.. మంచి ఊపుమీదున్న సమయంలో రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.. ఆ తర్వాత కివీస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆఖరిఓవర్లలో పెద్దగా రన్స్ రాలేదు.. సంజు శాంసన్‌ , శివమ్‌ దూబె మళ్లీ నిరాశ పరిచారు.

164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్‌.. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత ధాటిగా ఆడినా.. భారత బౌలర్ల ముందు తలవంచక తప్పలేదు. ఓ దశలో దాదాపు గెలిచేంత పని చేసిన కివీస్‌.. చివరి ఓవర్లలో బొక్కబోర్లా పడింది. డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌ బుమ్రా, యువ బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ దెబ్బకు కివీస్‌ ఆటగాళ్లు బేజారెత్తారు. వరుస వికెట్లు కోల్పోవడంతో మరోసారి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. వికెట్లు తీస్తూ పొదుపుగా బౌలింగ్‌ చేస్తూ కివీస్‌జట్టుకు చుక్కలు చూపించారు భారత బౌలర్లు.దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన కివీస్‌.. 156 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

ఈ సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐదో టీ20లో 45 పరుగులు చేసిన రాహుల్ సిరీస్‌లో మొత్తం 224 పరుగులు చేశాడు. ఫలితంగా ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ పేరుపై ఉంది. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కోహ్లీ 199 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డు కాగా, ఇప్పుడా రికార్డును రాహుల్ అధిగమించాడు. ఈ సిరీస్‌లో రాహుల్ 56 సగటతో 224 పరుగులు చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ శివం దూబే ఓ చెత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఒక ఓవర్లో ఏకంగా 34 పరుగులు సమర్పించుకొని.. ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ తర్వాతి స్థానంలో నిలిచాడు...2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఏకంగా 36 పరుగులు ఇచ్చాడు.

Tags

Read MoreRead Less
Next Story