హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మూడో మెట్రో రైల్ కారిడార్ ప్రారంభానికి సర్వం సిద్ధం

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మూడో మెట్రో రైల్ కారిడార్ ప్రారంభానికి సర్వం సిద్ధం

హైదరాబాద్‌ నగరవాసులకు మరో మెట్రో లైన్ అందుబాటులోకి రానుంది. మూడో మెట్రో రైల్ కారిడార్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

అటు మూడో మెట్రో కారిడార్‌కు ముహూర్తం ఖరారైనట్టు టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ ఏడాది హైదరాబాద్ వాసులకు గ్రేట్ న్యూస్ అంటూ ఎల్ అండ్ టి మెట్రో రైల్ ట్వీట్ చేసింది. నిజానికి జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ఈ సంక్రాంతికే ప్రారంభం కావాల్సింది. అయితే, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆలస్యమైంది. మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు అధికారులు.

జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో మార్గం 9 స్టేషన్లను కలుపుతూ వెళుతుంది. ఇప్పటికే నిర్మాణం, ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు గత 45 రోజులపాటు ట్రయల్ రన్ నిర్వహించారు. మెట్రో రైలు భద్రతా శాఖ నుంచి 20 రోజుల క్రితమే అనుమతులు కూడా పొందింది.

హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు మార్గాల్లో మెట్రో పరుగులు పెడుతోంది. మొదటి దశలో భాగమైన నాగోల్ - అమీర్‌పేట - మియాపూర్ మార్గాన్ని.. 2017 నవంబరులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత ఎల్బీ నగర్ అమీర్‌పేట మార్గం 2018 అక్టోబరులో అందుబాటులోకి వచ్చింది. ఇక అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గాన్ని 2019 మార్చిలో నాటి గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు.

దీంతో నాగోల్ – హైటెక్ సిటీ కారిడార్ 29 కిలోమీటర్లు, మియాపూర్ -ఎల్బీ నగర్ కారిడార్‌ 29 కిలోమీటర్లు ప్రస్తుతం మెట్రో రైలు నడుస్తోంది. ఇప్పుడు జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కిలోమీటర్ల వరకు అందుబాటులోకి రానుంది. ఈ కారిడార్‌తో మెట్రో రైలు ద్వారా నగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మెట్రో రైలు అందుబాటులోకి రానుంది.

రెండు అతిపెద్ద బస్టాండులను లింక్ చేస్తూ నిర్మించిన జేబీఎస్-ఎంజీబీఎస్‌ మెట్రో కారిడార్‌ హైదరాబాద్ వాసుకే కాకుండా.. జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వివిధ పనుల కోసం హైదరాబాద్‌ వచ్చే వారికి ఎంతో ఉపయోగపడనుంది. అంతేకాదు, కారిడార్‌తో దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు కారిడార్‌గా హైదరాబాద్ మెట్రో రికార్డ్ సృష్టించనుంది.

ఈ కారిడార్ ప్రారంభోత్సవం ద్వారా హైదరాబాద్ పాతబస్తీ మినహా అన్ని మార్గాల్లో మెట్రో అందుబాటులోకి రానుంది. ఈ మెట్రో మార్గంతో హైదరాబాద్ ప్రయాణికులకు చాలావరకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎల్బీనగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి రాయదుర్గం మార్గంలో ఇప్పటికే 2 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ మెట్రో కారిడార్ అందుబాటులోకి వస్తే రోజుకు 3 లక్షల మందికిపైగా హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి.

ఇక, పండగ సీజన్‌లో ప్రయాణికులు పెద్ద బస్టాండ్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకొనే అవకాశాలు ఉంటాయి. దాదాపు మూడు మెట్రో కారిడార్లు అందుబాటులోకి వస్తుండటంతో.. అధికారులు మెట్రో పాసులను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story