ర్యాలీలు.. దీక్షలతో అలుపెరగని పోరాటం చేస్తున్న అమరావతి రైతులు

ర్యాలీలు.. దీక్షలతో అలుపెరగని పోరాటం చేస్తున్న అమరావతి రైతులు

అమరావతి రైతుల ఆందోళన రోజు రోజుకూ ఉధృతమవుతోంది. 49వ రోజున పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ తుళ్లూరులో రైతులు దీక్షకు దిగారు. మరోవైపు బుధవారంతో ఉద్యమానికి 50 రోజులు పూర్తవుతున్న సందర్భంగా సత్యాగ్రహ దీక్షలను ముగించనున్నారు. గాంధీ వర్ధంతి రోజున ఈ సత్యాగ్రహ దీక్షలు మొదలయ్యాయి. 50 మంది రైతులు గత 75 గంటలుగా ఈ సత్యాగ్రహ దీక్షలో కూర్చున్నారు. అలాగే కుల వృత్తులు చేస్తూ వినూత్న నిరసన చేపట్టనున్నట్టు జేఏసీ నేతలు నిర్ణయించారు.

49వ రోజు మందడం, వెలగపూడి, తుళ్లూరు ప్రాంతాల రైతులు రిలే దీక్షలు కొనసాగించారు. మహా ర్యాలీలో మహిళలు సైతం భారీగా పాల్గొన్నారు. రాయపూడి, వెలగపూడి, ఎర్రబాలెం, తెనాలి, గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, కృష్ణాయపాలెం తదితర ప్రాంతాల్లో రిలే దీక్షలను కొనసాగించారు. మహిళలు వంట పాత్రలు కడుగుతూ నిరసన తెలిపారు. మరోవైపు అమరావతి రైతులకు మద్దతుగా మంగళగిరి నుంచి తెనాలి వరకు టీడీపీ నేతలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు, రైతులు భారీగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

టీడీపీ ర్యాలీ వెంట చంద్రబాబు సైతం తన కాన్వాయ్‌లో వెళ్లారు. మధ్యమధ్యలో ఆగుతూ స్వాగతం పలుకుతున్న రైతులను పలకరిస్తూ.. రాజధాని తరలిపోకుండా తాను పోరాడుతానంటూ అందరికీ ధైర్యం కల్పించారు.

మందడం, వెలగపూడిలో మహాధర్నాలతో పాటు 24 గంటల దీక్షలు కొనసాగాయి. ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన విరమించుకునే వరకు.. తమ పోరాటం కొనసాగుతుందని రైతులు హెచ్చరించారు. రాజధాని కోసం ఎన్నాళ్లైనా పోరాటం చేస్తామన్నారు రైతులు. 49 రోజులుగా నిద్రాహారాలు లేకుండా చేసి, తమను వేదనకు గురి చేసి ప్రభుత్వం ఏం సాధిస్తుందని ప్రశ్నించారు.

మరోవైపు అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో 73 ఏళ్ల ఈడ్పుగంటి బుల్లబ్బాయి గుండె పోటుతో మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. రాజధాని అమరావతి కోసం బుల్లబ్బాయి కురగల్లులో తనకు ఉన్న అర ఎకరం భూమిని ఇచ్చారు. గత కొన్నిరోజులుగా రాజధాని రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్న బుల్లబ్బాయి.. రాజధాని తరలిస్తున్నారన్న మనస్తాపంతోనే మృతిచెందాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు రాజధాని ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో కొందరు రైతులను వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శ్రీదేవి.. ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను సీఎంకు వెల్లడించారు. మూడు రాజధానులవల్ల వచ్చే ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, అమరావతి రైతులకు ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక అటు.. తాడికొండ అడ్డరోడ్డు దీక్షా శిబిరం నుంచి అమరావతి అమరేశ్వరుని ఆలయానికి భారీగా ర్యాలీ చేపట్టారు. అమరావతి బస్ స్టాండ్ నుంచి ఆలయం వరకు రైతులు, మహిళలు పాదయాత్ర నిర్వహించారు. అమరావతిని కాపాడాలని అమరేశ్వర స్వామిని మొక్కుకున్నారు. స్వామికి పొంగలి సమర్పించి పూజలు నిర్వహించారు.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ గుంటూరు జిల్లా కార్యాలయం ఎదుట రైతులు దీక్షకు దిగారు. కలెక్టరేట్‌ ముందు దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఇతర నేతలు దీక్షలో కూర్చొన్నారు.

మూడు రాజధానులు వద్దు.. అమరావతినే ముద్దంటూ అనంతపురం జిల్లా కదిరి మండలంలోని చెర్లోపల్లి రిజర్వాయర్లో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో నీటిలో దిగి అర్థనగ్న నిరసనలు చేపట్టారు. మూడు రాజధానులు వద్దని ఒకే రాజధాని కావాలంటూ నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story