హాజీపూర్‌ వరుస హత్యల కేసులో గురువారం తీర్పు

హాజీపూర్‌ వరుస హత్యల కేసులో గురువారం తీర్పు

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో గురువారం తుది తీర్పు వెలువడనుంది. ఇప్పటికే విచారణ ముగియడంతో నిందితుడు సైకో కిల్లర్ మర్రిశ్రీనివాస్ రెడ్డికి శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంది. జనవరి 27నే తీర్పు వస్తుందని అనుకునప్నప్పటికీ అనివార్య కారణాల వల్ల కేసు గురువారానికి వాయిదా పడింది. సమత హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష పడిన నేపథ్యంలో.. ఈ కేసులో తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజిపూర్ గ్రామానికి చెందిన సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి లిఫ్ట్ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య చేసి బావిలో పూడ్చిపెట్టాడు. అలా శ్రావణి, మనీషా, కల్పన లను చంపినట్లు పోలీసులు గుర్తించారు. గతఏడాది ఏప్రిల్ 25న హాజిపూర్ గ్రామానికి చెందిన శ్రావణి కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కదిలారు. కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ బావి వద్ద.. ఆ బాలిక స్కూల్ బ్యాగ్ ను గుర్తించారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అదే గ్రామానికి చెందిన మనీషా తో పాటు మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పన ను సైతం అత్యాచారం చేసి చంపినట్లుగా తేలింది. అతనిచ్చిన సమాచారంతోనే బావిలో తవ్వకాలు జరిపి ఆ ఇద్దరు బాలికల అస్థికలు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఈ హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో సైకో కిల్లర్‌ మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలని, ఎన్కౌంటర్ చేయాలని గ్రామస్ధులు ఆందోళనలకు దిగారు.

ఈ కేసును తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం నల్గొండలో ప్రత్యేకంగా ఫోక్సో కోర్టును ఏర్పాటు చేసింది. జులై 31 నుంచి ప్రత్యేక ఫోక్సో కోర్టులో విచారణ కొనసాగింది. బాలికల హత్య కేసులను విచారించిన న్యాయస్థానం.. అన్ని కోణాలనూ పరిశీలించింది. ఫోరెన్సిక్ తో పాటు సైంటిఫిక్ ఆధారాలను కూడా సేకరించిన పోలీసులు వాటిని సాక్ష్యాధారాలుగా కోర్టుకు సమర్పించారు. మొత్తం 101 మంది సాక్షులను విచారించిన కోర్టు.. వారి సాక్ష్యాలను నమోదు చేసింది. నిందితుని అభిప్రాయాన్ని కూడా తీసుకుంది. గురువారం తుది తీర్పు వెలువరించనుంది. ఇటీవలే సమత హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష పడటంతో.. ఈ కేసులో వెలువడే తీర్పుపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story