రెండో పెద్ద మెట్రో గా హైదరాబాద్ మెట్రో రైల్ రికార్డ్

రెండో పెద్ద మెట్రో గా హైదరాబాద్ మెట్రో రైల్ రికార్డ్

పద్మవ్యూహాన్ని తలపించే హైద‌రాబాద్ ట్రాఫిక్ చిక్కుల నుంచి విముక్తి కల్గిస్తూ.. 2017 నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా హైదరాబాద్ మెట్రో పరుగు ప్రారంభమైంది. మియాపూర్ - ఎల్బీనగర్ కారిడార్ లో మియాపూర్ నుంచి అమీర్ పేట్ స్ట్రెచ్ లో తొలిసారి మెట్రో కూతపెట్టింది.

హైదరాబాద్ మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చిన రెండు కారిడార్లలో.. ఆరంభంలో ఆదరణ

అంతంతమాత్రంగానే వుండేది. ఆ తర్వాత నాగోల్ నుంచి రాయదుర్గం వరకు.. ఎల్బీన‌గ‌ర్ నుంచి మియాపూర్ వరకు.. రెండు మార్గాల్లో పూర్తిస్థాయిలో మెట్రో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎక్కువ‌ మంది న‌గ‌ర వాసులు మెట్రో రైలు ప్ర‌యాణం చేస్తున్నారు. ప్ర‌స్తుతం రోజు 4 లక్షల మంది ప్ర‌యాణికులు మెట్రోలో తమ గమ్యం చేరుతున్నారు.

మొత్తం 3 కారిడార్ల లో.. ఇప్పటికే ఒకటి, మూడు కారిడార్లలో మెట్రో అందుబాటులోకి వచ్చింది. ఇక పాతబస్తీ ఏరియా తప్ప.. మిగిలిన రెండో కారిడార్ కూడా శుక్రవారం నుంచి అందుబాటులోకి రాబోతోంది. జేబీఎస్ - ఫలక్ నమా కారిడార్ లో.. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో పరుగులు పెట్టబోతోంది.

ఈ కారిడార్ మొత్తం 15 కిలోమీటర్లు. అయితే, అలైన్మెంట్ వివాదాల కారణంగా అందులో జేబీఎస్ నుండి ఎంజిబిఎస్ వరకు 11 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు పూర్తి అయ్యాయి. దీంతో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు.. మెట్రో రైలును సీఎం కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

నగరంలో అతిపెద్ద బస్ స్టేషన్లయిన జూబ్లీ బస్ స్టేషన్మ, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మార్గాన్ని మెట్రో రైల్ కలపనుంది. దీంతో నగరవాసులకే కాదు, జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా ఈ మార్గం ఎంతో ఉపయోగకరంగా వుండనుంది.

జేబీఎస్ నుంచి నుంచి ఎంజీబీఎస్ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే 45 నిమిషాల సమయం పడుతుంది. అదే మెట్రో రైలు కేవలం 16 నిమిషాల్లో చేరుకోవచ్చు.

జేబీఎస్ - ఎంజీబీఎస్ రూటు అందుబాటు లోకి వస్తే నగరం లో ట్రాఫిక్ కష్టాలు తగ్గడం తో పాటు.. దేశంలో రెండో పెద్ద మెట్రో గా హైదరాబాద్ మెట్రో రైల్ రికార్డ్ సృష్టించనుంది.

శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, పురపాలక శాఖ అధికారులు, నగర పోలీస్ కమిషనర్ తోపాటు.. ఎల్ అండ్ టి ప్రతినిధులు హాజరయ్యారు.

అటు మంత్రులు తలసాని, మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ మేయర్ బొంతు రామ్మోహన్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.

మొత్తం మీద సేఫ్ అండ్ కూల్ జర్నీ అందిస్తున్న మెట్రో.. సాంకేతిక సమస్యలు అధిగమించి మిగతా రూట్లలో కూడా మెరుగైన సేవలు అందించాలని హైదరాబాద్ నగరవాసులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story