అంబరాన్ని అంటుతున్న మేడారం సంబరం

అంబరాన్ని అంటుతున్న మేడారం సంబరం

మేడారం సంబరం అంబరాన్ని అంటుంతోంది. జాతరలో కీలక ఘట్టంగా భావించే సమ్మక్క గద్దెలపైకి గురువారం చేరుకుంటారు. మేడారం సమీపంలోని చిలకల గుట్టపై నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపర్చుకుని చిలకల గుట్టపై నుంచి తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ములుగు జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ సమ్మక్కను తీసుకొచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ ‌ ఏకే 47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. లక్షలాది భక్తులు సమ్మక్కకు ఎదురేగి.. కోళ్లు, మేకలను బలి ఇస్తారు. సమ్మక్కను ప్రతిష్ఠించాక భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శుక్రవారం మేడారానికి గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు.

మరోవైపు ఇప్పటికే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందడి కొనసాగుతోంది. కోరుకున్న మొక్కులు తీర్చే సారలమ్మ మేడారం గద్దెపై బుధవారం రాత్రి కొలువుదీరారు. కొత్తగూడ మండలం పూను గొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూ రునాగారం మండలం కొండాయి నుంచి గోవింద రాజులు సైతం సారలమ్మతోపాటే మేడారం గద్దెల పైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర అంబరాన్నంటింది.

కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం బుధవారం సాయంత్రం సారలమ్మ పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.50 గంటలకు గుడి నుంచి వెదురు బుట్ట లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయల్దేరారు. జంపన్నవాగులో కాళ్లు శుద్ధి చేసుకొని మేడారం గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజుతో కలసి వడ్డెలు ముగ్గురి రూపాలను అర్ధరాత్రి 12.24 గంటలకు మేడారం గద్దెలపై చేర్చారు. కన్నెపల్లి నుంచి 3.6 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను చేర్చే అద్భుత సన్నివేశాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. దారి పొడవునా ఇరువైపులా ఎదురేగి దండాలు పెట్టారు. సారలమ్మను తీసుకొస్తున్న పూజారి దాటుకుంటూ వెళ్తే.. సంతాన భాగ్యం కలుగుతుందని, కోర్కెలు నెరవేర తాయని భక్తుల నమ్మకం. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను వెదురు బుట్ట (పట్టెమూకుడు) లో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవునా భక్తులు కింద పడుకుని వరం పట్టారు. సారల మ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సారలమ్మ గద్దెలకు రాక ను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ము బూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో పరవశించింది.

Tags

Read MoreRead Less
Next Story