హైదరాబాద్‌లో ఇద్దరికి కరోనా? వారెక్కడెక్కడ తిరిగారోనన్న దానిపై ఆందోళన..

హైదరాబాద్‌లో ఇద్దరికి కరోనా? వారెక్కడెక్కడ తిరిగారోనన్న దానిపై ఆందోళన..

తెలంగాణలోనూ కోరానా వైరస్‌ ప్రవేశించిందా అనే భయం వెంటాడుతోంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేసే ఇద్దరు చైనీయులకు కరోనా లక్షణాలున్నాయా అనే అనుమానం కలుగుతోంది. గాంధీ ఆస్పత్రిలో పరిస్థితి చూస్తుంటే ఔననే అంటున్నాయి వైద్య వర్గాలు. కానీ అధికారి కంగా ఎవరూ ధ్రువీకరించడంలేదు. భారతదేశంలో ఇప్పటి వరకు కేరళలో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకగా, ఇప్పుడు హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు చైనీయులకు లక్ష ణాలు ఉన్నాయన్న ప్రచారంతో ఒక్కసారిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉలిక్కిపడింది.

సాధారణంగా ఆస్పత్రికి కరోనా అనుమానితులు ఎవరైనా వస్తే వారిని ఒకే ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి ఒకే చోట చికిత్స చేస్తుంటారు. కానీ ఈ ఇద్దరు చైనీయులను మాత్రం రెండు ప్రత్యేక గదుల్లో విడివిడిగా చికిత్స చేస్తుండటం కరోనా ప్రవేశించిందనే వాదనలకు బలం చేకూరుస్తోంది. అంతేకాదు వారికి ఒకసారి వైద్య పరీక్ష చేయగా, పాజిటివ్‌ లక్షణాలు, అనుమానాలు రావడంతో రెండోసారి పరీక్షలకు పంపించారు. ఆ రిపోర్టులు వచ్చాక ప్రకటిస్తామని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అన్నీ నిర్ధారించుకున్నాకే ప్రకటిస్తారని అంటున్నారు.

ప్రస్తుతం ఆ ఇద్దరు చైనా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 31న వారు చైనాలోని షాంఘై నగరం నుంచి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. కరోనా వైరస్‌ చైనాలో విజృంభించిన నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలు చేయించుకుని వైరస్‌ లేదని నివేదిక తీసుకొస్తేనే విధుల్లో చేర్చుకుంటామని వారు పనిచేసే సాఫ్ట్‌వేర్‌ కార్యాలయ వర్గాలు ఆదేశించాయి. దీంతో ఆ ఇద్దరు చైనీయులు మొన్న ఫీవర్‌ ఆస్పత్రికి వెళ్లి అవసరమైన శాంపిళ్లను ఇచ్చారు. వారు ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ కాకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే వారి నివేదికలో ఇరువురికి కరోనా పాజిటివ్‌ లక్షణాలున్నట్లు ప్రాథమికంగా వైద్యులు గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కేంద్రప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన చైనీయుల కోసం ఆరా తీశారు.

పాజిటివ్‌ వచ్చిన నివేదికతోపాటు మరోమారు రక్తనమూనాలు సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబోరేటరీకి పంపాల్సి ఉంటుందంటున్నారు. అక్కడ కూడా కరోనా పాజిటివ్‌ అని తేలితే ల్యాబ్‌ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిస్తారు. అప్పుడు మాత్రమే తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైనట్లు కేంద్రం ప్రకటిస్తుందని వైద్యాధికారులు అంటున్నారు. ఇక గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు ఎటువంటి కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ స్పష్టంచేశారు.

కరోనా అనుమానిత కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతోంది. చైనా దాని సమీప దేశాల నుంచి వచ్చిన వారు ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే కరోనా నోడల్‌ కేంద్రాలకు చేరుకుని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇలా ఇప్పటికే 37 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరందరికీ నెగిటివ్‌ రావడంతో ఆయా బాధితులందరినీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. గురువారం గాంధీలో మరో 11 మంది.. ఫీవర్‌ ఆస్పత్రిలో 9 మంది చొప్పున కొత్తగా 20 మంది అనుమానితులు చేరారు.

Tags

Read MoreRead Less
Next Story