హైదరాబాద్‌ ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్‌

హైదరాబాద్‌ ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్‌

హైదరాబాద్‌ ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్‌.. పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్‌ నుంచి బయటపడేసే మెట్రో రెండో కారిడార్ శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తోంది. ముఖ్యంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు బస్‌లో వెళ్లాల్సిన ప్రయాణికులకు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే వారికి ఈ మెట్రో ప్రయాణం వరంగా మారనుంది. హైదరాబాద్‌ సికింద్రబాద్‌ నగరాలను అనుసంధానం చేస్తూ జేబీఎస్ ఎంజీబీఎస్ వరకు నిర్మించిన ఈ మెట్రో రూటుతో తొలివిడత సంపూర్ణం కానుంది. ఈ రూట్లో మొదటిదైన జేబీఎస్ స్టేషన్ జూబ్లీ బస్‌స్టాండు ప్రాంగణానికి సమీపంలో ఉంది. దీని ద్వారా ప్రయాణికులకు చాలామేర ఇక్కట్లు తప్పనున్నాయి.

శుక్రవారం ప్రారంభమవుతున్న మెట్రోరైలు మార్గంలో జేబీఎస్‌–పరేడ్‌ గ్రౌండ్స్, సికింద్రాబాద్‌ వెస్ట్, న్యూ గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ రూట్‌లో ఒక చివర నుంచి మరో చివరకు చేరుకునేందుకు 16 నిమిషాల సమయం పట్టనుంది. నిత్యం సుమారు లక్షమంది ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తారని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.

రైల్వే స్టేషన్ ఆస్పత్రులు, విద్యా, వ్యాపార సంస్థలు ఈ మార్గంలో ఉండడంతో మెట్రోతో చాలావరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కోఠి, సుల్తాన్ బజార్ ప్రాంతాలకు ప్రయాణంలో ఈ రూటు కీలకం కానుంది. ఈ మార్గం మొత్తం రోడ్డు మార్గంలో వెళ్తే పెద్ద ట్రాఫిక్‌ లేకుంటే ఒక గంటా 10 నిమిషాలు పడుతుండగా మెట్రోలో కేవలం 16 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఎంజీబీఎస్ ఇంటర్ ఛేంజింగ్ కేంద్రం దేశంలోనే అతిపెద్ద కేంద్రంగా మారనుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా నేడు మెట్రో రైళ్లు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జేబీఎస్‌ వద్ద ఏర్పాటు చేయనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ మార్గం పూర్తితో గ్రేటర్‌ నగరంలో 69 కిలోమీటర్ల మెట్రోమార్గం అందుబాటులోకి వస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story