బడ్జెట్‌ కసరత్తులో తెలంగాణ ప్రభుత్వం

బడ్జెట్‌ కసరత్తులో తెలంగాణ ప్రభుత్వం

ఈనెల చివరి వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 2019-2020కు సవరించిన అంచనాలతోపాటు 2020-2021 బడ్జెట్‌ కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలను తీసుకుంది.. శాఖలవారీ పద్దులపై లెక్కలను సరి చూసుకుంది. బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ పథకాల ఆధారంగా పద్దులు సిద్ధం అయ్యాయి. నవంబర్‌ నాటికి 12,825కోట్ల జీఎస్టీ, 37,594కోట్ల పన్ను రాబడులు, అమ్మకం పన్ను 9,348కోట్లు, ఎక్సైజ్‌ 4,674కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్‌ల ద్వారా 3,169కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ 4,515కోట్ల మేర వసూలయ్యాయి. మరోవైపు ఆర్థిక మాంద్యం, ద్రవ్యలోటుతో పెరిగిన ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ రూపొందించింది.

2020-21 బడ్జెట్‌ వాస్తవిక అంకెలతో, అనవసర పద్దులను కుదించే దిశగా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సూచన, అవసరాల మేరకే ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. ఈ బడ్జెట్‌లో వీలైనంతమేర ప్రణాళికా వ్యయాన్ని తగ్గించేలా ప్రణాళికా పద్దులకు ప్రాధాన్యం ఇవ్వాలని సర్కార్‌ ఆలోచిస్తోంది. అక్కర్లేని పద్దులకు ప్రతీ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, నామమాత్రపు పద్దులను నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక రాష్ట్రంలో సుమారు 839 పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినవి అమలవుతున్నాయి. వీటిని ఏటా బడ్జెట్‌లో కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు నిధుల్లో అధిక ప్రాధాన్యమిచ్చి, వివిధ పథకాలకు గత బడ్జెట్‌ల తరహాలో ఇష్టానుసారం కాకుండా అవసరం మేరకే నిధులను కేటాయించనుంది ప్రభుత్వం. అనవసర వ్యయాలను తగ్గించేలా కొత్త బడ్జెట్‌లో అనేక కోతలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత విధానాలకు భిన్నంగా వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అదే రీతిలో పద్దులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2019-20 వార్షిక బడ్జెట్‌ను 29శాతం వరకు కుదించిన నేపథ్యంలో ఈ ఏడాది లక్షా 70వేల కోట్ల రూపాయలలోపే బడ్జెట్‌ ఉండవచ్చునని తెలుస్తోంది. మరోవైపు ఈ ఏడాది కూడా సంక్షేమ, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్నయం ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

Tags

Read MoreRead Less
Next Story