Top

రాష్ట్ర నేతలకు బీజేపీ నుంచి స‌రైన స‌పోర్ట్‌ అందడం లేదా?

రాష్ట్ర నేతలకు బీజేపీ నుంచి స‌రైన స‌పోర్ట్‌ అందడం లేదా?
X

తెలంగాణలో మనమే ప్రత్యామ్నాయం! ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం! ఇది గ‌త కొన్ని నెల‌లుగా బీజేపీ ముఖ్యనేత‌లు చెబుతున్న మాటలు! బీజేపీకి చ‌ట్టస‌భ‌ల్లో ఉన్నదే ఏడుగురు. అందులో న‌లుగురు లోక్‌సభ ఎంపీలు కాగా ఒక‌రు రాజ్యస‌భ స‌భ్యుడు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ! కాని వీరికి బీజేపీ నుంచి స‌రైన స‌పోర్ట్‌ అందడం లేదు. అసెంబ్లీలో మాట్లాడేందుకు కావాల్సిన స‌మాచారంను పార్టీ ఇవ్వక పోవడం వల్లే గ‌త స‌మావేశాల‌కు హాజ‌రు కాలేద‌ని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పడం సంచ‌ల‌నంగా మారింది. అంతే కాదు.. ఆయ‌న పై హైదరాబాద్ పోలీసుల దురుసు ప్రవ‌ర్తన తర్వాత... క‌నీసం పార్టీ నుంచి ప‌రామ‌ర్శ కూడా ల‌భించ‌లేదు. ఆర్టీసీ స‌మ్మె కాలంలో క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ పై కూడా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. తనపై పోలీసుల దాడి గురించి ఆయన లోక్‌సభ స్పీక‌ర్ కు సైతం ఫిర్యాదు చేశారు. అయినా పార్టీ నుంచి ఎలాంటి స‌పోర్ట్ అంద‌లేదు..

నిజామాబాద్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పసుపు బోర్డు తెస్తానంటూ ఎన్నిక‌లకు వెళ్ళిన అర‌వింద్.... ఆ మేర‌కు స్పైస్‌ బోర్డు రీజ‌న‌ల్ కార్యాల‌యాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకట‌న చేయించారు. అయితే దీనిపై టీఆర్ఎస్ పార్టీ నేత‌లు ,ఎమ్మెల్యేలు, మంత్రులు అర‌వింద్ పై విరుచుకు ప‌డ్డారు. రైతుల‌కు కావాల్సింది ప‌సుపు బోర్డ్ కాని స్పైసెస్ బోర్డు కాదంటూ తీవ్ర విమ‌ర్శలు చేస్తున్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి లు. ఈ విమర్శల్ని తిప్పికొట్టడం లేదు రాష్ట్ర బీజేపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే యండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ మీడియా స‌మావేశం ఏర్పాటుచేయాల‌ని భావించినా ఆ ప్రెస్ మీట్ ర‌ద్దైంది. నాయ‌క‌త్వం మాట్లాడ‌క పోవ‌డం, మాట్లాడేందుకు ముందుకు వ‌చ్చిన నేతలు సైతం వెన‌క్కు త‌గ్గడం చర్చనీయాంశమైంది.

ఓ వైపు ప్రభుత్వ విధానాల‌పై పోరాడుతామంటున్న బీజేపీ.. సొంత పార్టీ ప్రజాప్రతినిధుల‌కు అండ‌గా ఉండ‌క పోవ‌డం విమర్శలకు తావిస్తోంది. సొంత నేతల్నే ఆదుకోలేని పార్టీ.... ఇక సామాన్యుల స‌మ‌స్యల‌పై ఏం పోరాటం చేస్తుందని విమర్శిస్తున్నారు కింది స్థాయి కేడ‌ర్.

Next Story

RELATED STORIES