తమిళనాడులో రాజుకున్న విజయ్ వర్సెస్ బీజేపీ వివాదం

తమిళనాడులో రాజుకున్న విజయ్ వర్సెస్ బీజేపీ వివాదం

తమిళనాడులో రాజుకున్న విజయ్ వర్సెస్ బీజేపీ వివాదం ముదురుతోంది. నైవేలి గనుల్లో అనుమతి లేదంటూ బీజేపీ కార్యకర్తలు విజయ్ సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో హీరో ఫ్యాన్స్, బీజేపీ కార్యకర్తల మధ్య వివాదం రాజుకుంది. ఐటీ సోదాలు, విచారణ తర్వాత... విజయ్ రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఐతే.. గనుల్లో షూటింగ్ జరుగుతోందని తెల్సుకున్న బీజేపీ కార్యకర్తలు స్పాట్‌కు వెళ్లి.. ఆందోళనకు దిగారు. నైవేలి గనుల్లో సినిమా షూటింగ్‌లకు అనుమతులు లేవని ఇక్కడ సినిమా ఎలా చిత్రీకరిస్తారని నిలదీశారు. షూటింగ్ ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.

షూటింగ్ స్పాట్ లో బీజేపీ ఆందోళన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. సినిమా షూటింగ్ కి బీజేపీ అడ్డు తగులుతోందన్న సమాచారంతో విజయ్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. ధర్నాకు దిగారు. ఒకవైపు బీజేపీ కార్యకర్తల ఆందోళన, మరోవైపు విజయ్ అభిమానుల ధర్నా.. నైవేలి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరువర్గాల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పరిస్థితులు దారికి రాకపోవడంతో విజయ్ అభిమానులపై లాఠీఛార్జ్ చేశారు.

తన అభిమానులపై లాఠీచార్జ్ విషయం తెలుసుకున్న విజయ్.. వెంటనే అక్కడికి వచ్చి అభిమానులకు నచ్చజెప్పి పంపించారు. అయితే.. కోట్ల రూపాయలు పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై తమిళ హీరో విజయ్, ఏజీఎస్‌ నిర్మాణ సంస్థ అధినేత, సినీ నిర్మాత, ఫైనాన్షియర్‌ అన్బుసెళియన్‌ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేసింది. విజయ్ ఇంట్లో నుంచి దాదాపు 60 కోట్ల రూపాయలు విలువైన డబ్బు, నగలు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ షూటింగ్ ను అడ్డుకోవటంపై అతని అభిమానులు సీరియస్ అవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story