అంతర్జాతీయం

కరోనావైరస్ బారిన పడి నిన్న ఒక్కరోజే 89 మంది మృతి

కరోనావైరస్ బారిన పడి నిన్న ఒక్కరోజే 89 మంది మృతి
X

భయంకరమైన కరోనావైరస్ చైనాను పట్టి పీడిస్తోంది. దీని బారిన పడి నిన్న ఒక్కరోజే 89మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 811కు చేరింది. వైరస్ కట్టడికి ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ప్రభావం కనిపించడంలేదు. రోజు రోజుకు మరణాల సంఖ్యతోపాటు, దాని బారిన పడుతున్నవారి సంఖ్యకూడా భారీగా పెరుగుతోంది. వైరస్ కు కేంద్రంగా ఉన్న వుహాన్ ప్రావిన్స్ లో ఒక్కరోజులోనే 81 మరణించారు. చైనాలో మొత్తం 37,198 మందికి కరోనా వైరస్ సోకిందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. కొత్తగా మరో 2వేల 656మందికి ఈ వైరస్ సోకింది. చైనాలో విజృభిస్తున్న కరోనా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్యసంస్థ తీవ్రంగా స్పందించింది. వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా అదుపులోకి వస్తున్నా.... వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గుముఖం పట్టలేదని ఆందోళన వ్యక్తం చేసింది.

వైరస్ సోకిన వుహాన్ పట్టణంలో రోగులను గుర్తించి, వారిని కట్టుదిట్టమైన నిర్బంధిత వైద్యశిబిరాల్లో చేర్చాలని చైనా ఉపప్రధాని సున్ చున్ లాన్ అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీచేశారు. ఇప్పుడు దేశంలో యుద్ద వంటి అత్యవసర పరిస్థితి వచ్చిందని, విధునుంచి తప్పించుకుంటే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అయితే కోటి పైగా ఉన్న వుహాన్ పట్టణంలో అధికారులు ఇంటింటికి తిరుగుతూ వైరస్ బాధితులను గుర్తిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా నిర్బంధించి వైద్యశిబిరాలను తరలిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆస్పత్రులన్ని నిండిపోవడంతో అనుమానితులను ఎక్కడికి తరలించాలో అధికారులు అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది.

కరోనా భయంతో జపాన్‌ ప్రభుత్వం యెకోహోమా తీరంలో నిలిపివేసిన నౌకలోని భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ అనే ఆ నౌకలో నిర్బంధంలో ఉన్న వారు తమను రక్షించాలంటూ ప్రాణ భయంతో వీడియోలు పెడుతున్నారు. బినయ్‌ కుమార్‌ సర్కార్‌ అనే భారతీయుడు తమను కాపాడాలంటూ సోషల్‌ మీడియా ద్వారా వేడుకున్నారు. 200 మంది భారతీయులతో పాటు నౌకలో అంతా కలిపి 3,700 మంది ఉన్నారనీ, వీరిలో 62 మందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయిందన్నారు. అయితే తమ నౌకను అధికారులు దిగ్బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. వైరస్‌ ఇంకా మరింత మందికి వ్యాపించకుండా ఉంటే, ఫిబ్రవరి 19 వరకు వీరందరినీ వేరుగా ఉంచాల్సి ఉంటుందని నౌకలోని జపాన్‌ అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 6వ తేదీన రాత్రి 7 గంటల వరకు భారతీయులెవ్వరికీ కరోనా సోకలేదని జపాన్‌ ప్రభుత్వం తెలిపింది.

ఇక కరోనా వైరస్ పేరు చెపితేనే భారతీయులు వణికిపోతున్నారు. సాధారణ జలుబు, జ్వరం వచ్చినా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో చైనా,హాంకాంగ్, సింగపూర్, మలేషియా, దేశాలకు వెళ్లిన వచ్చిన వారు భయాందోళనకు గురవుతున్నారు. సాధారణ దగ్గు, జలుబు వచ్చినా ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. విదేశాలనుంచి వచ్చినవారు అధికారుల ఆదేశాలతో హైదరాబాద్ నగరంలోని గాంధీ, ఫీవర్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. గాంధీలో ఇప్పటివరకు 40మందికి పరీక్షలు చేయగా... వారిలో 32మందికి ఎలాంటి వ్యాధికారక లక్షణాలు లేవని తేల్చారు. మరికొన్ని పరీక్షల రిపోర్టు రావాల్సిఉంది.

ప్రాణాంతకమైన కరోనావైరస్ మొదట సాధారణ ప్లూ లక్షణాలే కనిపిస్తాయని, జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ఆయాసం వస్తుందని వైద్యులు అంటున్నారు. సాధారణ ప్లూ వస్తే ఎలాంటి భయంలేదని, అదే కరోనా సోకితే వాటిప్రభావం పెరుగుతూ ఉంటుందంటున్నారు. విదేశాలనుంచి వచ్చినవారు, వారి బంధు,మిత్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చలి వాతావరణంలో ప్లూ జ్వరంతోపాటు కరోనా వైరస్ కూడా త్వరగా వ్యాప్తి చెందుతుంది హెచ్చరిస్తున్నారు. మూడు నాలుగు రోజులపాటు వ్యాధికారక లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Next Story

RELATED STORIES