54వ రోజుకు చేరుకున్న రాజధాని రైతులు ఆందోళన

54వ రోజుకు చేరుకున్న రాజధాని రైతులు ఆందోళన

రాజధాని రైతులు ఆందోళన ఇవాల్టితో 54వ రోజుకు చేరింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా రైతులు వెనుకడుగు వేయడం లేదు. మందడం, తుళ్లూరులో మహాధర్నా, వెలగపూడిలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల.. యువకులు 151 గంటలు, 24 గంటల దీక్షలు చేపట్టారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకునేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని రాజధాని ప్రజలు తేల్చిచెబుతున్నారు.

తుళ్లూరులో రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 151 గంటల దీక్ష చేపట్టిన యువకులకు సంఘీభావంగా తుళ్లూరు నుంచి వెలగపూడికి ర్యాలీగా వచ్చారు రైతులు. 13 జిల్లాలకు చెందిన దివ్యాంగులు 53 బైక్‌లతో గుంటూరు నుంచి ర్యాలీ నిర్వహించారు. రాజధాని గ్రామాలను సందర్శించారు.. దీక్షలో కూర్చుతున్న రైతులకు మద్దతు తెలిపారు..

రాజధాని రైతులకు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మద్దతు పలికారు. తాడికొండ, పెదపరిమి, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. జగన్‌ లాంటి సీఎం దేశంలో మరెక్కడా లేరని మండిపడ్డారు..

అటు... తెలంగాణ మేడారంలో అమరావతి నినాదాలు మార్మోగాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సమ్మక్క, సారలమ్మను వేడుకున్నారు. సీఎం జగన్‌ మనసు మార్చాలని వనదేవతలకు బంగారం సమర్పించి మొక్కుకున్నారు.

అమరావతి రైతులకు విపక్ష పార్టీలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. కుల,మత,వర్గ విభేదాలు లేకుండా ప్రజలంతా సంఘీభావం తెలుపుతున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించేవరకు తమ ఉద్యమం ఆగదని మహిళలు తెగేసి చెబుతున్నారు.

ఇవాళ కూడా అమరావతి ప్రాంతంలో ధర్నాలు, దీక్షలు జరగుతాయని తెలిపారు రాజధాని రైతులు. తమ డిమాండ్‌ నెరవేరేవరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు రైతులు.

Tags

Read MoreRead Less
Next Story