రాజధాని విషయంలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు

రాజధాని విషయంలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు

వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం 8 నెలల్లోనే ఏపీ చెల్లాచెదురు చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే పెట్టుడిదారులు పారిపోతున్నారని.. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘సింగపూర్‌ కన్సార్టియం, కియా అనుబంధ సంస్థలు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ఆసియా పేపర్‌ అండ్‌ పల్ప్‌, రిలయన్స్‌.. అన్నీ ఎనిమిది నెలల్లోనే పొరుగు రాష్ట్రాలకు క్యూ కట్టాయని అన్నారు. ఇది చాలదన్నట్టుగా అమరావతిలో సచివాలయం ఉండగా విశాఖలో మిలీనియం టవర్‌లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుంటారా అంటూ విమర్శించారు. సొంతంగా ఒక భవనం కూడా కట్టుకోలేని జగన్ ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా?’’ అంటూ జగన్‌ను నిలదీశారు.

విశాఖపై ఉన్న కక్షతోనే జగన్ ఇక్కడ పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ నేతలు ఫైరయ్యారు. నగరంలో భారీ ఎత్తున భూములను కబ్జా చేసేందుకు రంగం సిద్ధమైందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా తయారయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు నేతలు. విశాఖలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనంద్‌బాబు,నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

అమరావతి రైతుల ఆందోళనలపై మేమూరు వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యమంలో అసలు రైతులేలేరని.. పెయిడ్ ఆర్టిస్టులు, రౌడీలతో ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా మూడు రాజధానులను ఆపలేరని అన్నారు మేరుగ నాగార్జున‌. అమరావతి విషయంలో ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. రైతుల ఆందోళనలు ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story