ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌

ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ వేటు పడింది. సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారంటూ ఆయన్ను విధుల్లోంచి తొలగించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ఇజ్రాయేల్‌తో సెక్యూరిటీ పరికరాల కొనుగోలు అక్రమాలు జరిగాయని, దేశభద్రత ముప్పు కలిగించారన్న ఆరోపణలపై ఆయన్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు చీఫ్ సెక్రటరీ నీలం సహాని. ఆలిండియా సర్వీసెస్ అధికారుల రూల్స్ ప్రకారం, ప్రజాప్రయోజనాల రిత్యీ ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

రూల్స్‌కు విరుద్దంగా ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు చేశారంటూ మొత్తం ఏడు ఆరోపణలపై విచారణ జరిపి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇజ్రాయోల్‌ సంస్ధ నుంచి నిఘాపరికరాలు కొనుగోలు చేశారని, కుమారుడు చేతన్‌ కృష్ణ సంస్థ ఆకాశం అడ్వాన్స్ టెక్నాలజీకి కాంట్రాక్ట్‌కు ఇప్పించారని ఉత్తర్వులో తెలిపింది. దేశ భద్రతను పణంగా పెడుతూ... విదేశీ కంపెనీకి ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్ లీక్ చేశారని ఆరోపించింది. సెక్యూరిటీ పరికరాల కొనుగోలు లో కంపెనీతో కుమ్మక్కయ్యారని, కుమారుడి సంస్థకు కాంట్రాక్టు దక్కేలా వ్యవహరించారని తెలిపింది. విదేశీ సంస్థతో కుమారుడి సంస్థకు కాంట్రాక్ట్‌ ఇచ్పించుకోవడం ఆల్‌ ఇండియా సర్వీస్‌ రూల్స్‌కు విరుద్ధమని ప్రభుత్వం పేర్కొంది. విదేశీ సంస్థతో నిఘా సమాచారం పంచుకుని జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపించింది. అంతేకాకుండా నాణ్యత లేని నిఘా పరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర, దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తించారని ఉత్తర్వులో పేర్కొంది.

ప్రాథమిక ఆధారాలు, నిర్దిష్టమైన సమాచారం ఆధారంగా ఏబీ వెంకటేశ్వరరావు ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులో తెలిపింది ప్రభుత్వం..

1980 ఐపీఎస్‌ బ్యాచ్‌ చెందిన ఏబీ వెంకటేశ్వరరావును గతంలోనే బదిలీ చేసిన వైసీపీ ప్రభుత్వం.... కొన్నాళ్లు పోస్టింగ్‌ కోసం వెయిటింగ్‌లో పెట్టింది. ఇప్పుడు సస్పెన్షన్‌ ఆర్డర్‌ జారీ చేసింది. ఆయనమీద వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం.. ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టం చేసింది. సస్పెన్షన్‌ కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ వదలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story